ప్రొ కబడ్డీ సీజన్ 12 విజేతగా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ 31-28 తేడాతో పుణేరి పల్టాన్‌ను ఓడించింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన దబాంగ్ ఢిల్లీ సెకండాఫ్‌లో అనూహ్యంగా తడబడింది. అనవసర ట్యాకిల్స్‌తో పాటు పేలవ రైడ్స్‌తో పాయింట్స్ సమర్పించుకుంది. దాంతో పుణేరి పల్టాన్ రేసులోకి వచ్చింది. కానీ చివరి క్షణాల్లో పాయింట్స్ సాధించి ఆధిక్యాన్ని కాపాడుకున్న దబాంగ్ ఢిల్లీ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. 12 సీజన్లలో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
మరో 40 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా వెటరన్ డిఫెండర్ ఫజల్ అట్రాచలి చేసిన ట్యాకిల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో అతను సాధించిన ఏకైక పాయింట్ కూడా ఇదే కావడం విశేషం. కానీ ఆ ఒక్క పాయింట్ దబాంగ్ ఢిల్లీ విజయాన్ని ఖాయం చేసింది. దబాంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్(9), అజింక్యా పవార్(6) సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించారు. పుణేరి పల్టాన్ తరఫున ఆధిత్య షిండే(10), అభినేష్(4) రాణించినా ఫలితం లేకపోయింది.

మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన దబాంగ్ ఢిల్లీ ఫస్టాఫ్‌లో పుణేరి పల్టాన్ ఒకసారి ఆలౌట్ చేసి 20-14తో ఆధిక్యంలో నిలిచింది. తొలి అర్థ భాగంలో రైడింగ్‌లో 13 పాయింట్స్ సాధించిన దబాంగ్ ఢిల్లీ.. 3 ట్యాకిల్ పాయింట్స్ అందుకుంది. సెకండాఫ్‌లో మాత్రం దబాంగ్ ఢిల్లీ అనూహ్యంగా తడబడింది. రైడర్స్ విఫలమవ్వడంతో ప్రత్యర్థి చేతిలో ఒకసారి ఆలౌట్ అయ్యింది. దాంతో స్కోర్లు సమమై మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ ఫజల్ అట్రాచలీ కీలక ట్యాకిల్ పాయింట్‌తో ఆధిక్యం అందించి విజయాన్ని ఖాయం చేశాడు.
సెకండాఫ్‌లో దబాంగ్ 4 రైడింగ్ పాయింట్స్‌తో పాటు 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించగా.. పుణేరి పల్టాన్ 8 రైడింగ్ పాయింట్స్‌తో పాటు 3 ట్యాకిల్ పాయింట్స్ అందుకుంది. ఫస్టాఫ్ వైఫల్యం పుణేరి పల్టాన్ ఓటమిని ఖరారు చేసింది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తెలుగు టైటాన్స్ క్వాలిఫయర్-2లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.