Tokyo 2020: ఏడ్చే టైమ్ లేదు.. కనీసం కాంస్యమైనా గెలవాలి.. హాకీ ఆటగాళ్ల భావోద్వేగం!

టోక్యో: 49 ఏళ్ల తర్వాత సెమీఫైనల్‌కు చేరి ఆశలు రేకెత్తించిన భారత పురుషుల హాకీ టీమ్ కీలక మ్యాచ్‌లో తడబడింది. మంగళవారం బెల్జియంతో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ 5-2 తేడాతో ఓటమిపాలైంది. మూడు క్వార్టర్ల వరకు అద్భుతంగా పోరాడిన మన్‌ప్రీత్ సేన ఆఖరి క్వార్టర్లో చివరి ఐదు నిమిషాల వరకు విజయంపై ఆశలు రేపింది.
కానీ మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో ఒత్తిడికి చిత్తయిన మనోళ్లు ఓటమికి తలవంచారు. బెల్జియం టీమ్‌లో అలెగ్జాండర్ హెండ్రిక్స్ 19, 49, 53 నిమిషాల్లో మూడు గోల్స్‌తో టీమిండియా కలలను చిదిమేశాడు.అయితే ఈ ఓటమికి బాధపడేంత సమయం కూడా తమకు లేదని, దేశానికి కనీసం కాంస్యమైన అందించాలని భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు.

ఈ రోజు కలిసిరాలేదు..
గెలవాలనే కసితోనే బరిలోకి దిగినప్పటికీ.. అదృష్టం కలిసిరాలేదని భారత పురుషల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఈ ఓటమికి బాధపడే సమయం కూడా తమకు లేదన్నాడు. 'మేం గెలవాలన్న కసితోనే బరిలోకి దిగాం. దురదృష్టవశాత్తు విజయం దక్కలేదు. ఈ ఓటమితో చాలా బాధేస్తోంది. కానీ మేమిప్పుడు కాంస్య పతక పోరుపై దృష్టి సారించాలి. పతకం తేవాలి. సుదీర్ఘ కాలం తర్వాత సెమీసుకు చేరుకోవడం గొప్ప ఘనతే. ఐదేళ్లుగా జట్టు కలిసికట్టుగా ఆడింది. ఈ స్థాయికి చేరుకొనేందుకు మేమంతా కలిసే శ్రమించాం. మరింత మెరుగైన ఫలితానికి మేం అర్హులం. కానీ ఈ రోజు దురదృష్టం వెంటాడింది' అని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు.

ఏడుస్తూ కూర్చుంటే..
ది వాల్, గోల్ కీపర్ శ్రీజేశ్ సైతం కెప్టెన్ మన్‌ప్రీత్ అభిప్రాయంతో ఏకీభవించాడు. బెల్జియం చేతిలో ఓటమి బాధాకరమే అయినా తర్వాతి మ్యాచ్‌పై దృష్టి సారించడం అంతకన్నా ముఖ్యమని పేర్కొన్నాడు. 'నిరాశ చెందాం. కానీ బాధపడేంత సమయం లేదు. దానిని త్వరగా మర్చిపోయి ముందుకు సాగాలి. మేం పతకం గెలిచేందుకు ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో ఏడుస్తూ కూర్చోవడం కన్నా కాంస్యంపై దృష్టి సారించడం కీలకం. ఈ మ్యాచ్‌ను మళ్లీ చూసి ఎక్కడ పొరపాట్లు చేశామో గుర్తించాలి. దానిని సరిదిద్దుకోవాలి' అని శ్రీజేశ్ తెలిపాడు.

మహిళలలైనా..
'నిజమే, ఓటమితో గుండె పగిలింది. 41 ఏళ్ల తర్వాత సెమీస్ చేరాం. మేం స్వర్ణం గెలిచేందుకే ఆడాం. కానీ ఈ రోజు ఓడిపోయాం. తర్వాతి మ్యాచ్ గెలిస్తే మాకు కాంస్యం లభించే అవకాశం ఉంది. తర్వాత అందుకోబోయే పతకం మాతోనే ఉన్నా దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంటుంది. మేం గొప్ప పట్టుదలతో ఉన్నాం. మేం సెమీస్ చేరుకొనేందుకు అదే ఉపయోగపడింది. కుర్రాళ్లు బాగా ఆడారు. తర్వాతి మ్యాచ్ కోసం మేం ప్రణాళికలు వేసుకోవాలి' అని సీనియర్ డిఫెండర్ రూపిందర్ పాల్ సింగ్ అన్నాడు. తాము ఓడినప్పటికీ మహిళల జట్టైనా ఫైనల్ చేరుకోవాలని శ్రీజేశ్, మన్‌ప్రీత్, రూపిందర్ ఆశించారు. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తీరు అద్భుతమని వారంతా ప్రశంసించారు.

ప్రధాని ఫోన్..
ఓటమితో నిరాశకు లోనైన భారత హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉత్సాహాన్ని ఇచ్చారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఆయన టీమ్ కేప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్ మెగా టోర్నమెంట్‌లో అన్ని మ్యాచుల్లోనూ అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ఈ ఒక్క ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలని మోదీ వారికి సూచించారు. కాంస్య పతకాన్ని సాధించడానికి సర్వశక్తులను కూడగట్టుకోవాలని అన్నారు. ప్రత్యర్థి ఎవరైనప్పటికీ- ధైర్యాన్ని కోల్పోవద్దని, తమదైన శైలిలో మ్యాచ్‌లో సత్తా చాటాలని, స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకోవాలని భారత ప్రధాని అకాంక్షించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications