Tokyo 2020: హాకీ సెమీఫైనల్లో పోరాడి ఓడిన భారత అమ్మాయిలు.!

టోక్యో: భారత మహిళల హాకీ టీమ్ కల చెదిరింది. ఒలింపిక్స్ చరిత్రలోనే అద్భుత ఆటతో తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరిన భారత మహిళల టీమ్.. పురుషుల టీమ్ తరహాలోనే ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. బుధవారం ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో వరల్డ్ 9వ ర్యాంకర్ అయిన భారత్ 1-2 తేడాతో వరల్డ్ నెంబర్ 2 అర్జెంటీనా చేతిలో పోరాడి ఓడింది. చివరి క్వార్టర్ వరకు పోరాడిన భారత అమ్మాయిలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.
మ్యాచ్ మొత్తంలో అధిక పెనాల్టీ కార్నర్స్ ఇచ్చుకొని మూల్యం చెల్లించుకున్నారు. భారత్ తరఫున గుర్జిత్ కౌర్(2వ నిమిషం) ఏకైక గోల్ చేయగా.. అర్జెంటీనా కెప్టెన్ మారియా బారినోవా(18వ, 36వ నిమిషం) డబుల్ గోల్స్‌తో భారత పతనాన్ని శాసించింది. బ్రాంజ్ ఫైట్‌లో భారత అమ్మాయిలు గ్రేట్ బ్రిటన్‌తో తలపడనున్నారు.

ఆరంభంలో దూకుడు..
ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత అమ్మాయిలు ప్రత్యర్థిపై పై చేయి సాధించారు. గేమ్ 2వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జిత్ కౌర్ గోల్‌గా మలిచి జట్టును 1-0తో ఆధిక్యంలో నిలిపింది. ఆ తర్వాత మరింత ధీటుగా ఆడిన భారత అమ్మాయిలు అర్జెంటీనాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థి టీమ్‌కు రెండు పెనాల్టీలు లభించినా భారత డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. దాంతో భారత అమ్మాయిలు ఫస్ట్ క్వార్టర్‌ను 1-0తో ముగించారు.

మలుపు తిప్పిన కెప్టెన్
ఇక సెకండ్ క్వార్టర్‌లో దూకుడు కనబర్చిన అర్జెంటీనా బంతిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ క్రమంలోనే అనవసర తప్పిదాలు చేసిన భారత అమ్మాయిలు.. ప్రత్యర్థికి వరుసగా పెనాల్టీ కార్నర్‌లు ఇచ్చుకొని మూల్యం చెల్లించుకున్నారు. 18వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అర్జెంటీనా కెప్టెన్ మారియ బారినోవా గోల్‌గా మలిచి ఆటను 1-1తో మలుపు తిప్పింది. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అర్జెంటీనాకు దక్కిన పలు అవకాశాలను భారత అమ్మాయిలు సమర్థవంతంగా అడ్డుకున్నారు.

మరో గోల్‌తో..
ఈ క్రమంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను అర్జెంటీనా గోల్ కీపర్ అడ్డుకుంది. ఆ వెంటనే మరో అవకాశం దక్కినా భారత అమ్మాయిలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాంతో సెకండ్ క్వార్టర్ 1-1తో ముగిసింది. ఇక మూడో క్వార్టర్‌లో మరింత దూకుడుగా ఆడిన అర్జెంటీనా 36వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ మారియ గోల్‌గా మలచడంతో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత అమ్మాయిలు రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. నెహా శర్మ గ్రీన్ కార్డ్ హెచ్చరికతో మైదానం వీడటంతో భారత్ మూడో క్వార్టర్‌లో 10 మందితోనే ఆటను కొనసాగించింది.

చివరి నిమిషం వరకు పోరాడినా..
నాలుగో క్వార్టర్‌లో బంతిపై ఆధిపత్యం చలాయించిన భారత్‌కు 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించినా ఫలితం లేకపోయింది. అర్జెంటీనా రక్షణ శ్రేణి పాదరసంలా కదలడంతో టైమ్ సమీపిస్తుందన్న ఒత్తిడి భారత అమ్మాయిల అవకాశాలను దెబ్బతీసింది.
చివరి నిమిషంలో భారత్ గోల్ చేసే ప్రయత్నం చేయడం అర్జెంటీనా కీపర్ ఆపడం.. రాణీ రాంపాల్ వెంటనే రివ్యూ కోరడంతో మైదానంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ రిఫరీ నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా రావడంతో అర్జెంటీనా విజయం లాంఛనమైంది. అనుభవరాహిత్యంతోనే అమ్మాయిలు ముందడుగు వేయలేకపోయారు. ఇప్పుడు వారి ముందున్న ఆఖరి చాన్స్‌పై దృష్టిసారించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications