భారత హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తరహాలోనే తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా స్పెయిన్‌తో గురువారం జరిగిన కాంస్య పోరులో చివరి సారిగా బరిలోకి దిగిన శ్రీజేష్.. అద్భుత విజయంతో ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఈ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే తన రిటైర్మెంట్ విషయాన్ని శ్రీజేష్ ప్రకటించాడు.
గురువారం జరిగిన కాంస్య పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత విజయ లాంఛనం పూర్తయిన వెంటనే మైదానంలో బొక్క బోర్లా పడుకొని శ్రీజేష్ సాష్టాంగ నమస్కారం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలానే మైదానంలో పడుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు.

టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ నేపథ్యంలోనే రోహిత్ శర్మ నేలపై పడుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. తాజాగా పీఆర్ శ్రీజేష్ సైతం అలానే మైదానాన్ని మొక్కి వీడ్కోలు పలికాడు. దాంతో ఈ రెండు ఫొటోలను ఎడిట్ చేసి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. రోహిత్ శర్మ తరహాలోనే పీఆర్ శ్రీజేష్ సైతం తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడని కామెంట్ చేస్తున్నారు.
కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన పీఆర్ శ్రీజేష్‌కు సహచర ఆటగాళ్లు ఘన వీడ్కోలు పలికారు. ఆటగాళ్లంతా శ్రీజేష్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్‌పై కూర్చోబెట్టారు. అనంతరం తమ హాకీ స్టిక్స్‌తో శ్రీజేష్‌కు జేజేలు పలికారు. చివరగా.. ప్రేక్షకులు, భారత ఆటగాళ్ల కరతాళ ధ్వనుల మధ్య శ్రీజేష్ బరువెక్కిన హృదయంతో మైదానం వీడాడు.
ప్రస్తుతం శ్రీజేష్ వీడ్కోలుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. స్పెయిన్‌తో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. హర్మన్‌ప్రీత్ సింగ్(29వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్లేస్(18వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. శ్రీజేష్ అడ్డుగోడలా నిలబడి స్పెయిన్ గోల్స్ అడ్డుకున్నాడు.