పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత హాకీ టీమ్‌కు నిరాశే ఎదురైంది. మంగళవారం ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో భారత్ 2-3 తేడాతో జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. దాంతో 44 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరాలనే భారత్ కల చెదిరింది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఆఖరి వరకు హర్మన్‌ప్రీత్ సేన పోరాడింది. కీలక సమయంలో చేసిన తప్పిదాలు భారత్ కొంపముంచాయి.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్(7వ నిమిషం), సుఖ్‌జీత్ సింగ్(36వ నిమిషం) గోల్స్ నమోదు చేయగా.. జర్మనీ తరఫున గొంజాలో పెయిలట్(18వ నిమిషం), క్రిస్టోఫర్ రుహుర్(27వ నిమిషం), మార్కో మిల్ట్‌కావు(54వ నిమిషం)లో గోల్స్ సాధించారు. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ గైర్హాజరీ టీమిండియా కొంపముంచింది. క్వార్టర్ ఫైనల్లో రెడ్ కార్డ్ ఎదుర్కొన్న అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. ఈ నిర్ణయం భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. సెమీస్‌లో ఓడిన భారత్.. స్పెయిన్‌తో గురువారం కాంస్యపోరు ఆడనుంది.

భారత్ శుభారంభం..
మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలో భారత్‌కు వరుసగా రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ భారత ఆటగాళ్లు గోల్స్ సాధించలేకపోయారు. ఫస్ట్ క్వార్టర్‌లో అటాకింగ్ గేమ్ ఆడిన భారత్.. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుంది. దాంతో ఐదో నిమిషంలోనే భారత్‌కు వరుసగా 4 పెనాల్టీ కార్నర్స్ లభించాయి. కానీ జర్మనీ గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు.
ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన భారత్.. జర్మనీ రక్షణ శ్రేణిని ఛేదిస్తూ పదే పదే గోల్ పోస్ట్‌పైకి దాడి చేసింది. ఈ క్రమంలో ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత భారత్ మరింత దూకుడుగా ఆడింది. దాంతో తొలి క్వార్టర్‌ను భారత్ 1-0తో ముగించింది.
పెనాల్టీ స్ట్రోక్‌తో..
రెండో క్వార్టర్ ఆరంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ డిఫెండర్ గొంజాలో పెయిలట్ గోల్‌గా మలిచి స్కోర్లను 1-1తో సమం చేశాడు. అనంతరం భారత్‌కు గోల్ చేసే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ కాసేపటికే భారత డిఫెండర్ జర్మన్‌ప్రీత్ సింగ్ చేసిన ఘోర తప్పిదంతో జర్మనీ పెనాల్టీ స్ట్రోక్ లభించింది. క్రిస్టోఫర్ రూహర్ గోల్ కొట్టి జర్మనీకి 2-1తో ఆధిక్యాన్ని అందించాడు.
మూడో క్వార్టర్‌లో దూకుడు పెంచిన భారత్.. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై వరుస దాడులు చేసింది. ఈ క్రమంలో వారికి లభించిన పలు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకుంది. జర్మనీ గోల్ కీపర్ అడ్డుగా నిల్చొని భారత గోల్స్‌ను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ ప్రీత్ గోల్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ బంతి టార్గెట్‌ను మిస్సవ్వగా సుఖ్‌జీత్ గోల్ పోస్ట్‌లోకి పంపించి 2-2తో స్కోర్లు సమం చేశాడు.
చివర్లో గోల్ చేసి..
చివరి క్వార్టర్‌లో దూకుడు పెంచిన జర్మనీ.. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుంది. భారత్ డిఫెన్స్‌ను చేదిస్తూ గోల్ పోస్ట్‌పైకి దాడి చేసింది. శ్రీజేష్ అద్భుతంగా అందుకున్నాడు.మరో 6 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. జర్మనీ గోల్ నమోదు చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో భారత్‌పై ఒత్తిడి పెరగ్గా.. స్కోర్లు సమం చేసేందుకు అటాకింగ్ గేమ్ ఆడింది. గోల్ కీపర్ లేకుండానే ఎక్స్‌ట్రా స్టోక్ ప్లేయర్‌తో దూకుడు కనబర్చింది. కానీ జర్మనీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని అందుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది.