జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 5-3 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో వరుసగా మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది ఐదో టైటిల్. గతంలో భారత్ 2004, 2008, 2015, 2023లో విజేతగా నిలిచింది.
భారత్ తరఫున ఆర్జిత్ నాలుగు గోల్స్(4వ నిమిషం, 18వ, 47వ, 54వ నిమిషం)తో సత్తా చాటగా.. దిల్ రాజ్ సింగ్(19వ) ఓ గోల్ కొట్టాడు. పాకిస్థాన్ తరఫున సుఫియాన్(30వ నిమిషం, 39వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. హనన్ షాహిత్(3వ నిమిషం) ఓ గోల్ నమోదు చేశాడు.

పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే పాకిస్థాన్ గోల్ నమోదు చేసి దూకుడు కనబర్చింది. అయితే నిమిషం వ్యవధిలోనే ఆర్జీత్ భారత్‌కు గోల్ అందించాడు. దాంతో స్కోర్లు సమమయ్యాయి. ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించినా.. ఫస్ట్ క్వార్టర్‌లో మరో గోల్ నమోదు కాలేదు.
రెండో క్వార్టర్ ఆరంభంలోనే ఆర్జీత్ సింగ్ మరో గోల్ కొట్టగా.. నిమిషం వ్యవధిలోనే దిల్‌రాజ్ సింగ్ మరో గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. రెండో క్వార్టర్ చివర్లో సుఫియాన్ గోల్ నమోదు చేయడంతో ఫస్టాఫ్ ముగిసే సరికి భారత్ 3-2తో ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్‌లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో సుఫియాన్ 39వ నిమిషంలో గోల్ నమోదు చేసి స్కోర్లను సమం చేశాడు. దాంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. చివరి క్వార్టర్ ఆరంభంలోనే ఆర్జీత్ సింగ్ గోల్ కొట్టి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. మరో ఏడు నిమిషాల వ్యవధిలో మరో గోల్ కొట్టి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆట చివరి 6 నిమిషాల్లో గోల్ కోసం పాకిస్థాన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు.