సలాలా: జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్ 2023లో భారత జట్టు విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో అసాధారణ ప్రదర్శనతో గెలుపొందింది. ఈ విజయంతో నాలుగో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న భారత్.. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించింది. మూడు టైటిళ్లతో పాక్ రెండో స్థానానికి పరిమితమైంది.
గురువారం జరిగిన ఫైనల్లో భారత్ 2-1 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అంగద్ వీర్ సింగ్ (13వ నిమిషంలో), అరిజీత్ సింగ్ (20వ) చెరో గోల్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ తరపున అలీ బషారత్ (38వ నిమిషం) గోల్ కొట్టాడు. ఈ టోర్నీ అసాంతం ఆధిపత్యం చెలాయించిన భారత్.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది.

పూల్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న భారత కుర్రాళ్లు.. టైటిల్ ఫైట్‌లో మాత్రం అదరగొట్టారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్.. తొలి నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ సాధించినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. ఆరో నిమిషంలో దక్కిన మరో పెనాల్టీ కార్నర్‌ను పాకిస్థాన్ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత ప్రత్యర్థిపై దాడులను పెంచిన భారత్.. ఎట్టకేలకు 13వ నిమిషంలో అంగద్ గోల్‌తో ఖాతా తెరిచింది.
రెండో క్వార్టర్‌లో భారత్ మరింత దూకుడు కనబర్చింది. 20వ నిమిషంలో అరిజీత్ ఫీల్డ్‌గోల్‌తో భారత్ ఆధిక్యం డబుల్ అయ్యింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని దాటుకుని అతను బంతిని గోల్‌పోస్టు లోపలికి పంపించాడు. అక్కడి నుంచి భారత్‌ను అందుకునేందుకు పాకిస్థాన్ వేగం పెంచింది.
38వ నిమిషంలో అబ్దుల్ నుంచి పాస్ అందుకున్న అలీ.. బంతిని లోపలికి పంపించడంతో పాక్ ఖాతా తెరిచింది. ఇక చివరి క్వార్టర్‌లో పోరు మరోస్థాయికి చేరింది. స్కోరు సమం చేసేందుకు పాక్.. ఆధిక్యాన్ని పెంచుకునేందుకు భారత్ పోటాపోటీగా తలపడ్డాయి. ఆఖర్లో పాకిస్థాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్లను మన రక్షణ శ్రేణి గొప్పగా ఆపగలిగింది. చివరి వరకూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసుకుంది.