Rani Rampal: కులం పేరుతో హాకీ ప్లేయర్ కుటుంబాన్ని దూషించడం సిగ్గులేని చర్య!

టోక్యో: భారత మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియా కుటుంబాన్ని కులం పేరుతో దూషించడం సిగ్గులేని చర్యని కెప్టెన్ రాణీ రాంపాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ హాకీ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమికి దళిత వర్గానికి చెందిన వందన కటారియానే కారణమని కొంతమంది యువకులు ఆమె ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. మహిళల ఓటమిని పటాసుల కాల్చుతూ సెలెబ్రేట్ చేసుకున్నారని, కులం పేరుతో దూషించారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. వీరిపై సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన రాణీ రాంపాల్.. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడొద్దని పిలుపునిచ్చింది. దయచేసి ఇలాంటివి చేయొద్దని, ప్లేయర్స్‌కు అండగా ఉండాలని కోరింది.

తండ్రి మరణించినా..
'వందన కుటుంబానికి జరిగిన సంఘటన విని చాలా బాధపడ్డాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆమె తండ్రి ఇటీవల మరణించారు. తండ్రి అంత్యక్రియలకు వందన వెళ్లలేదు. ఒలింపిక్స్‌కు ముందు వెళ్తే ట్రైనింగ్‌కు సమయం ఉండదని భావించి మాతోనే ఉండిపోయింది. మేమందరం దేశ నలుమూలల నుంచి వచ్చాం. మాలో హిందు, ముస్లిం, సిక్కులు ఇలా అనేక మతాలకు చెందిన వారు ఉంటారు. కానీ మాకు మతంతో సంబంధం లేదు.

మా ప్రదర్శనను ప్రశంసిస్తున్నారు..
భారత్, భారత్ జెండాకు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తాము. కాబట్టి ప్రజలు దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని కోరుతున్నాను. ఆటగాళ్లు.. దేశ కీర్తి ప్రతిష్టల కోసం తమ జీవితాల్ని త్యాగం చేస్తారు. ప్లేయర్స్ గెలిచినా, ఓడినా మీరు అండగా నిలవండి. అదే నా విన్నప్పం. అప్పుడే దేశం క్రీడాదేశంగా అవతరించగలదు. టోక్యో ఒలింపిక్స్‌లో మా ప్రదర్శనను చాలా మంది మెచ్చుకున్నారు. నెగటీవ్ కామెంట్ చేసే వారు ఈ విషయాన్ని నేర్చుకోవాలి'అని రాణి రాంపాల్ పేర్కొంది.

దళిత క్రీడాకారుల వల్లే ఓటమి..
వందన సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళల హాకీ జట్టులో "చాలా మంది దళిత క్రీడాకారులు" ఉన్నందున ఓడిపోయిందని, ఇద్దరు నిందితులు వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో శేఖర్ పేర్కొన్నారు. వందన మాత్రం ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించింది. 'ఈ విషయంపై నేనేం కామెంట్ చేయలేను. మా ఇంటి ముందు జరిగిందాని గురించి విన్నాను. నా కుటుంబంతో కూడా మాట్లాడాను. అంతా బాగానే ఉందని చెప్పారు. పోలీసులు ధర్యప్తు చేస్తున్నారు.'అని చెప్పుకొచ్చింది.

అంచనాల్లేకుండా..
అంచనాల్లేకుండా టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఆరంభంలో వరుసగా పరాజయాలపాలైనా.. ఆ తర్వాత పుంజుకొని అద్భుతం చేశారు. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్‌కు చేరారు. కీలక పోరులో ఒత్తిడిని జయించలేక అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో పోరాడి ఓడారు. ఇక కాంస్య పోరులో గ్రేట్ బ్రిటన్‌పై 3-4 తేడాతో ఓడి తృటిలో పతకాన్ని చేజార్చుకున్నారు. అమ్మాయిలు పతకం తేకపోయినా వారి ఆటతో మనసులు గెలుచుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications