Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత హాకీ విజయం వెనుక ఆ మాజీ ముఖ్యమంత్రి!

భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు అందుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో అసాధారణ ప్రదర్శనతో బ్రాంజ్ మెడల్ సాధించింది. గురువారం హోరాహోరీగా సాగిన కాంస్య పోరులో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. ఫలితంగా 1972 తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు అందుకుంది.

ఈ అద్భుతమైన విజయానికి అఖండ భారతావని మురిసిపోయింది. అశేష ప్రజానీకం ఉప్పొంగి పోయింది.140 కోట్ల భారతీయుల హృదయాలు పులకించిపోయాయి. సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. పారిస్ నడిబొడ్డున త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. చెక్‌దే ఇండియా నినాదాలు మార్మోగాయి.

How Naveen Patnaik helped

క్రికెట్ పిచ్చితో..
అయితే ఒకప్పుడు వెలుగు వెలిగిన భారత హాకీ ఆ తర్వాత మరుగున పడింది. పైగా ఇది మన జాతీయ క్రీడ కూడా. అంతే తప్పా ఈ ఆట గురించి పెద్దగా ఎవరికి కూడా తెలియదు. 1983 క్రికెట్ ప్రపంచకప్ విజయం తర్వాత దేశంలో క్రికెట్ ఆదరణ పెరగాక.. హాకీ పాతాళానికి పడిపోయింది. అసలు ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్ సాధించిన పతకాల్లో అత్యధికం హాకీలోనే వచ్చాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న హాకీ ఇండియా ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌‌కు అర్హత కూడా సాధించలేదు

తెరవెనుక హీరో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి
అలాంటి ప‌రిస్థితుల నుంచి ఇప్పుడు మ‌ళ్లీ అదే ఒలింపిక్స్‌లో వరుసగా మెడ‌ల్స్ గెలిచే స్థాయికి భారత జట్టు చేరిందంటే కోచ్, ఆటగాళ్లు కష్టం ఎంత ఉందో.. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంది. యావత్ భారతం క్రికెట్ పిచ్చిలో మునిగి తేలుతుండటంతో ఇతర ఆటలకు ఆదరణ లేకుండా పోయింది.

దాంతో కాసులు కురిపించే క్రికెట్‌ను కాదని ఇతర ఆటలను ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్లు ముందుకు రావడం కష్టమైంది. చాలా ఏళ్లు భారత హాకీ టీమ్‌కు సహారా స్పాన్సర్‌గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఆటకు ఆదరణ తక్కువవడంతో 2018లో సహారా తప్పుకుంది. హాకీ గేమ్‌కు కూడా ఇతర ఆటల్లానే స్పాన్సర్‌ను వెతుకునే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి స‌మ‌యంలో ఒడిశా మాజీ సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ ముందుకొచ్చారు.

స్వయంగా హాకీ ఆటగాడు కావడంతో...
హాకీ ఆటపై ఉన్న మక్కువతో పాటు జాతీయ క్రీడను బతికించాలనే ఆలోచనతో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందని చెప్పాడు. ఐదేళ్ల‌కుగాను నవీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం రూ.100 కోట్లకు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందమే భారత హాకీ టీమ్ రాత‌ను మార్చింది.

న‌వీన్ ప‌ట్నాయ‌క్ గ‌తంలో హాకీ ప్లేయ‌రే. ఆయ‌న స్కూల్‌లో చ‌దువుతున్న స‌మ‌యంలో హాకీ గోల్‌కీప‌ర్‌గా తన టీమ్‌ తరఫున బరిలోకి దిగేవాడు. ఆ ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి ఆయ‌న ముందుకు వ‌చ్చారు. పురుషుల జ‌ట్టుతోపాటు మ‌హిళ‌లూ జ‌ట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్స‌ర్‌గా ఉండ‌టానికి ఒడిశా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అయిన మూడేళ్ల తర్వాత హాకీ టీమ్ టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచింది.

భారత హాకీ ప్రతీ అడుగులో..
2014లో ఒడిశా ప్ర‌భుత్వం చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్య‌మిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్స‌ర్‌షిప్‌కు బీజం ప‌డింది. ఆ టోర్నీపై న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. ఆ త‌ర్వాత 2017లో ఒడిశా ప్ర‌భుత్వం స్పాన్స‌ర్‌గా ఉన్న క‌లింగ లాన్స‌ర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వ‌ర‌ల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వ‌హించింది.

ఆ త‌ర్వాత 2019లో ఇంట‌ర్నేష‌న‌ల్ హాకీ ఫెడ‌రేష‌న్ మెన్స్ సిరీస్ ఫైన‌ల్స్‌, ఒలింపిక్ హాకీ క్వాలిఫ‌య‌ర్స్‌.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జ‌రిగాయి. ఇలా ఇండియ‌న్ హాకీ వేసే ప్ర‌తి అడుగులోనూ న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెర వెనుక హీరోగా ఉంటూ వ‌స్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలైనా.. హాకీ టీమ్ అభివృద్ధికి తనవంతు సాయం చేస్తూనే ఉన్నారు.

Story first published: Thursday, August 8, 2024, 23:17 [IST]
Other articles published on Aug 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+