Hockey World Cup 2026: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి!
హాకీ ప్రపంచకప్ 2026లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. పూల్-డీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4-2 తేడాతో భారత్‌ను ఓడించింది. వేల్స్‌పై గత మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. తొలి అర్థ భాగంలో 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. సెకండాఫ్‌లో మూడు గోల్స్ సమర్పించుకొని ఓటమి చవిచూసింది.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (16వ నిమిషం), దిల్‌ప్రీత్ సింగ్ (24వ నిమిషం)చెరో గోల్ చేయగా.. ఇంగ్లండ్ తరఫున నికోలస్(13వ, 54వ నిమిషం), స్టువర్ట్ రష్‌మీర్(38వ నిమిషం), హెన్రీ క్రాఫ్ట్(42వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు.

మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 13వ నిమిషంలో నికోలస్ గోల్‌తో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. రెండో క్వార్టర్ మొదలుకాగానే హర్మన్‌ప్రీత్ సింగ్(16వ నిమిషం) గోల్ చేయడంతో స్కోర్ 1-1తో సమమైంది. 24వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అయితే సెకండాఫ్ గేమ్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపింది. పూర్తిగా బంతిని తమ ఆధీనంలో ఉంచుకొని భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఈ క్రమంలో మూడో క్వార్టర్‌లో స్టువర్ట్ రష్‌మీర్(38వ నిమిషం), హెన్రీ క్రాఫ్ట్(42వ నిమిషం) గోల్స్ చేయడంతో ఇంగ్లండ్ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. 54వ నిమిషంలో నికోలస్ మరో గోల్‌తో ఆ జట్టు తిరుగులేని స్థితిలో నిలిచి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. సెకండాఫ్‌లో భారత్ గోల్స్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ రెండో రౌండ్‌కు అర్హత సాధించగా.. భారత్ ముందంజ వేయాలనే బుధవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాకిస్థాన్ చేతిలో ఓడితే టీమిండియా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఒకవేళ పాకిస్థాన్‌తో భారత్ డ్రా చేసుకుంటే.. వేల్స్ ఇంగ్లండ్‌తో డ్రా చేసుకోవాలి లేదా ఓడిపోవాలి. ఒకవేళ వేల్స్ ఇంగ్లండ్‌ను ఓడించి..పాకిస్థాన్‌తో భారత్ డ్రా చేసుకుంటే.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం గోల్ తేడా ద్వారా నిర్ణయించాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
