
న్యూఢిల్లీ: భారత మాజీ హాకీ ప్లేయర్ బల్బిర్ సింగ్ కుల్లర్(77) మరణించారు. ఈ విషయాన్ని ఆదివారం హాకీ ఇండియా ట్విటర్ వేదికగా తెలియజేసింది. 1968 ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన బల్బిర్ సింగ్ మృతి పట్ల హాకీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 'బల్బిర్ సింగ్ మృతితో శోకతప్తులైన అతని కుటుంబీకులు, స్నేహితులకు హాకీ ఇండియా తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం.'అని ట్వీట్ చేసింది.
పంజాబ్, జలంధర్ జిల్లాలోని సన్సార్పుర్ గ్రామంలో జన్మించిన బల్బిర్ సింగ్ 1963లో అంతర్జాతీయ హాకీలోకి అరంగేట్రం చేశారు. ఇండియా జట్టులో ఫార్వార్డ్ ఆటగాడిగా సేవలందించిన బల్బిర్ సింగ్... భారత్ జట్టు తరఫున అనేక టోర్నీల్లో పాల్గొన్నాడు. బెల్జియం, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, వెస్ట్ జర్మనీ దేశాల పర్యటనలకు వెళ్లాడు.
1966 లో బ్యాంకాగ్ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన జట్టులో సభ్యుడైన బల్బిర్ సింగ్.. 1968లో మెక్సికో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టులోను ఉన్నాడు. హాకీ ఇండియాకు అతను చేసిన సేవలకు గుర్తింపుగా 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.