హాకీ ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. హాకీ ఇండియా సీఈఓ ఎలెనా నోర్మాన్(Elena Norman) తన పదవికి రాజీనామా చేశారు. 13 ఏళ్ల పాటు సీఈఓగా హాకీ ఇండియాకు సేవలందించిన ఆమె.. ఉక్కిరిబిక్కిరి పని వాతావరణంలో పనిచేయలేనని తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఇటీవలే భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ జన్నెకె స్కాప్‌మన్ (Janneke Schopman) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో మహిళలకు తగిన గౌరవం లేదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలోనే ఎలెనా నోర్మాన్ కూడా తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

హాకీ ఇండియాలో నెలకొన్న అంతర్గత వివాదాలతో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఎలెనా నోర్మాన్ పేర్కొంది. 'ఇరు వర్గాల పోరులో నలిగిపోయాను. అక్కడి పనివాతావరణం అంతా ఉక్కిరిబిక్కిరిగా మారింది. హాకీ ఇండియా రెండు వర్గాలుగా చీలిపోయింది. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, సెక్రటరీ భోలనాథ్ సింగ్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శ్రీవాత్సవ, ట్రెజరర్ శేఖర్‌లు రెండు గ్రూప్‌లుగా చీలిపోయారు.
గత మూడు నెలలుగా నాకు జీతం ఇవ్వలేదు. ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడంతో ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.'అని ఎలెనా నోర్మాన్ ఓ వార్థ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. హాకీ ఇండియా సీఈఓగా ఎలెనా హయాంలో భారత్ పలు అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చింది.
ఎఫ్ఐఎహెచ్ పురుషుల వరల్డ్ కప్ 2018, 2023 టోర్నీలతో పాటు జూనియర్ పురుషుల ప్రపంచకప్ 2016, 2021 టోర్నీలు నిర్వహించింది. హాకీ ఇండియా లీగ్ ఐదు ఎడిషన్లను దిగ్విజయంగా పూర్తి చేసింది.
భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ జన్నెకె స్కాప్‌మన్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 'భారత మహిళల సీనియర్ హాకీ జట్టు జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నా. హాకీ ఇండియా, సాయ్‌లకు ఒక నెల ముందస్తు నోటీస్ పంపిస్తున్నా. మార్చి 23వ తేదీన నా పదవి ముగుస్తుంది. నాకు రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించాలని కోరుతున్నా. భారత జట్టుతో తాను కొనసాగిన సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అంటూ స్కాప్‌మన్ వెల్లడించింది.
ఈ ఏడాది ఆగస్టు వరకు జన్నెకె స్కాప్‌మన్‌కు హాకీ ఇండియాతో కాంట్రాక్ట్ ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత 46 ఏండ్ల స్కాప్‌మన్ జట్టును వీడాల్సి ఉంది. కానీ హాకీ ఇండియాలోని అంతర్గత విభేదాల కారణంగా ఆమెకు సరిగ్గా వేతనం రాలేదు. దాందో ఐదు నెలల ముందే ఆమె రాజీనామా చేశారు.