
జకార్త: హాకీ ఆసియాకప్ 2022 ఫైనల్ బెర్త్‌ను తృటిలో చేజార్చుకున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్ బ్రాంజ్ మెడల్ సాధించింది. బుధవారం ఉత్కంఠగా సాగిన కాంస్యపోరులో భారత్ 1-0తో జపాన్‌ను ఓడించింది. భారత్ తరఫున రాజ్ కుమార్ పాల్(7వ నిమిషం) ఏకైక గోల్ సాధించి విజయాన్నందించాడు. మ్యాచ్ ఆరంభంలోనే రాజ్‌కుమార్ గోల్ కొట్టడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు అదే ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి క్వార్టర్‌లోనే ఒక్క గోల్ రాగా.. తర్వాతి మూడు క్వార్టర్లలో మరో గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. జపాన్ ఆటగాళ్లు పదే పదే భారత్ గోల్ పోస్ట్ వైపు దూసుకొచ్చిన డిఫెన్స్ విభాగం సమర్థవంతంగా అడ్డుకుంది. దాంతో గోల్స్ చేయడంలో ప్రత్యర్థి జట్టు విఫలమైంది.
ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్ తేడాతో టీమిండియా ఫైనల్ చేరకుండా సూపర్-4కే పరిమితమైన విషయం తెలిసిందే. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 4-4తో డ్రా చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటా పోటీగా తలపడ్డాయి.
భారత జట్టులో నీలమ్ సంజీప్(9వ నిమిషం), దిప్సన్ టిర్కీ(21వ నిమిషం), మహేశ్ శేషె గౌడ(22వ నిమిషం), శక్తివేల్ మరీశ్వరణ్(37వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. కొరియా జట్టులో జాంగ్ జాంగ్యూన్(13వ నిమిషం), జీ వూ చీన్(18వ నిమిషం), కిమ్ జంగ్ హూ(28వ నిమిషం), జంగ్ మాంజే(44వ నిమిషం) గోల్స్ చేసి భారత్ విజయాన్ని అడ్డుకున్నారు. ఇక హాకీ ఆసియా కప్ విజేతగా దక్షిణ కొరియా నిలిచింది. మలేసియాతో జరిగిన ఫైనల్లో 2-1తో గెలుపొంది బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.