న్యూఢిల్లీ: యావత్ దేశం భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ మత్తులో తేలుతుంటే.. భారత హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. పురుషుల హాకీ ఫైవ్స్ ఆసియాకప్ 2023 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్‌ను చిత్తు చేసి మరీ ఈ విజయాన్నందుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో భారత్ 6-4 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
నిర్ణీత సమయంలోపు ఇరు జట్లు 4-4తో సమంగా నిలవడంతో ఈ మ్యాచ్ ఫలితాన్ని షూటౌట్ ద్వారా నిర్ణయించారు. షూటౌట్‌లో భారత్ రెండో గోల్స్ చేయగా.. పాకిస్థాన్ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. తమ అవకాశాలను చేజార్చుకుంది. భారత గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకొని భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. షూటౌట్‌లో భారత ప్లేయర్లు మనిందర్ సింగ్, గుర్జోత్ సింగ్ గోల్స్ నమోదు చేశారు.

మ్యాచ్ ఆరంభం నుంచి జోరు కనబర్చిన పాకిస్థాన్.. భారత ఆటగాళ్లకు పరీక్షగా నిలిచింది. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. పాకిస్థాన్ గోల్ పోస్ట్‌లోకి పదే పదే దూసుకెళ్లిన భారత్‌పై వారిపై ఒత్తిడి తెచ్చింది. కానీ పాకిస్థాన్ ఎదురుదాడికి దిగి వరుస గోల్స్ సాధించింది. దాంతో ఫస్టాఫ్ ముగిసే సరికి 3-2తో ఆధిక్యంలో నిలిచిన పాకిస్థాన్ సునాయసంగా గెలిచేలా కనిపించింది.
కానీ సెకండాఫ్‌లో భారత ప్లేయర్ మహమ్మద్ రహీల్ వరుసగా రెండు గోల్స్ నమోదు చేసి స్కోర్లు సమం చేశాడు. భారత్ తరఫున సింగ్ జుగ్‌రాజ్(7వ నిమిషం), సింగ్ మనిందర్(10వ నిమిషం), రహీల్ మహమ్మద్ (19వ నిమిషం, 26వ నిమిషం)గోల్స్ నమోదు చేశారు. పాకిస్థాన్ తరఫున అబ్దుల్ రెహ్మాన్(5వ నిమిషం), రాణా అబ్దుల్(13వ నిమిషం), హయత్ జికిరియా(14వ నిమిషం), లియాకత్ అర్షద్(19వ నిమిషం) గోల్స్ కొట్టారు.