
ది లీడర్.. మన్‌ప్రీత్ సింగ్...
పంజాబ్, జలంధర్‌లోని మిథాపూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన 29 ఏళ్ల మన్‌ప్రీత్.. హాకీ జర్నీ అంతా సులువుగా జరగలేదు. తన చిన్నతనంలో తండ్రి మానసిక సమస్యలతో బాధపడుతుంటే.. తల్లి మంజీత్ కౌర్ కుటుంబాన్ని నడపడానికి ఎన్ని కష్టాలు పడిందో కళ్లారా చూశాడు.
ఆ కష్టాల్లో నుంచే అతను ఆటలో తిరుగులేని నైపుణ్యం, మానసిక ధృడసంకల్పం, మెండైన అత్మవిశ్వాసాన్ని సంపాదించాడు. 2016 సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో ఆడుతున్నప్పుడు మన్‌ప్రీత్ తండ్రి మరణించాడు. ఆ సంఘటనతో మన్‌ప్రీత్.. ఓర్చుకోలేని కష్టాలు ఎన్ని ఎదురైనా.. మనో నిబ్బరంతో ఉండటం నేర్చుకున్నాడు. ఈ లక్షణాలే.. అతన్ని టీమిండియాకు కెప్టెన్‌గా చేశాయి. 2011లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన మన్‌ప్రీత్ సింగ్.. 2012 లండన్ ఒలింపిక్స్ టీమ్‌లో సభ్యుడిగా తొలిసారి విశ్వక్రీడల్లో ఆడాడు.

రైతు బిడ్డ.. పీఆర్ శ్రీజేశ్..
కేరళ, ఎర్నాకులం జిల్లాలోని కిజాక్కాంబలంలోని రైతు కుటుంబంలో జన్మించిన శ్రీజేశ్.. వరల్డ్ బెస్ట్ గోల్ కీపర్లలో ఒకడు. టీమ్ లాస్ట్ లైన్ డిఫెన్స్‌లో అతను ఉంటే గోడ కట్టినట్లే. 2006 సౌత్ ఏషియన్ గేమ్స్‌లో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల శ్రీజేశ్.. 2011 నుంచి సీనియర్ టీమ్‌లో రెగ్యులర్ మెంబర్. 2016లో కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రీజేశ్.. 2016, 2018లో చాంపియన్స్ ట్రోఫీలో సిల్వర్ మెడల్స్‌ను అందించాడు.
చిన్నతనంలో స్ప్రింట్, లాంగ్ జంప్, వాలీబాల్ ఆడిన శ్రీజేశ్.. 12 ఏళ్ల వయసులో హాకీపై మనసు పారేసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అతని తండ్రి రవీంద్రన్ ఇంట్లో ఉన్న ఆవును అమ్మి.. గోల్ కీపర్ కిట్ కొనిచ్చాడు.

కరోనా నేపథ్యంలో ఎంట్రీ
సిమ్రన్‌జిత్.. కరోనా నేపథ్యంలో ఆల్టర్‌నేట్ ప్లేయర్లకు ఐవోసీ అనుమతించడంతో.. టీమ్‌లోకి వచ్చిన సిమ్రన్‌జిత్.. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. జలంధర్‌లోని సుర్జీత్ సింగ్ హాకీ అకాడమీకి చెందిన సిమ్రన్ జిత్... 2016 జూనియర్ వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ కూడా. సిమ్రన్‌జిత్ కజిన్ గుర్జాంత్ సింగ్ కూడా ఇండియా టీమ్ మెంబర్. యూపీలోని ఫిలిబిత్ నుంచి గుర్జాంత్ సింగ్ హాకీ కెరీర్ మొదలైంది.

మామకు స్వర్ణం.. అల్లుడికి కాంస్యం...
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన హార్దిక్ సింగ్‌కు జీన్స్‌లోనే హాకీ ఉంది. అతని తండ్రి, మామ.. భారత జట్టుకు ఆడారు. హార్దిక్ మామ గుర్మైల్ సింగ్ 1980 సమ్మర్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచిన భారత జట్టు సభ్యుడు. 2018లో అరంగేట్రం చేసిన హార్దిక్ సింగ్.. తండ్రి, మామ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టోక్యోలోనూ అదరగొట్టాడు. దాంతో మామకు స్వర్ణం వస్తే.. అల్లుడు కాంస్యంతో మెరిసినట్లైంది.

టీమిండియా ‘బాబ్'..రూపిందర్‌పాల్ సింగ్
పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లోని ఓ సిఖ్ ఫ్యామిలీలో పుట్టిన రూపిందర్‌పాల్.. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో ఆజానుబాహుడిలా కనిపిస్తాడు. 11 ఏళ్ల వయసులో ఆటను మొదలుపెట్టాడు.
సహచర ఆటగాళ్లు 'బాబ్' అని ముద్దుగా పిలుచుకునే రూపిందర్‌పాల్.. వరల్డ్ హాకీలో బెస్ట్ డ్రాగ్ ఫ్లిక్ ప్లేయర్. 2010లో అరంగేట్రం చేసిన అతను.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సుల్తాన్ అజ్లాన్ షాలో గోల్డ్ కొట్టాడు. 2014లో వైస్ కెప్టెన్‌గా ఎంపికైనా.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి 2018లో టీమ్ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. కానీ అదే ఏడాది ఆసియాగేమ్స్ టీమ్‌లో చోటు సంపాదించి.. శ్రీలంకపై హ్యాట్రిక్ గోల్స్ చేసి రీఎంట్రీని ఘనంగా చాటాడు. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లోనూ మెరిసాడు.

హర్మన్‌ప్రీత్ సింగ్.. డ్రాగ్ ఫ్లిక్ కింగ్
పంజాబ్, అమృత్‌సర్ శివారులోని జండియాల గురు టౌన్‌షిప్‌లోని ఓ రైతు బిడ్డ హర్మన్‌ప్రీత్. 2015లో అరంగేట్రం చేసి.. 2016 సుల్తాన్ కప్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2019 ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జరిగిన వరల్డ్ సిరీస్ ఫైనల్స్‌లో హర్మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. చిన్నప్పుడు ట్రాక్టర్‌పై మక్కువ చూపిన అతను పదేళ్ల వయసులోనే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే గేర్ స్టిక్‌తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అతను హాకీ స్టిక్‌ను మాత్రం అలవోకగా తిప్పడం నేర్చుకున్నాడు.
టోక్యోలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కీలక సమయాల్లో గోల్స్ అందించి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఆరుగురు ప్లేయర్లతో పాటు కోచ్ గ్రహం రీడ్ కూడా తన మాస్టర్‌మైండ్‌తో టీమ్‌ను తీర్చిదిద్దాడు. 2019లోనే భారత కోచింగ్ బాధ్యతలు తీసుకున్న గ్రహం.. రెండేళ్ల సమయంలోనే భారత్ ఒలింపిక్ మెడల్ అందుకునేలా కృషి చేశాడు.


Click it and Unblock the Notifications












