ఓవైపు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పేలవ ప్రదర్శనతో సతమతమవుతుంటే మరోవైపు ఆ దేశ హాకీ టీమ్ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని స్వదేశానికి చేరిన పాకిస్థాన్ హాకీ టీమ్ కెప్టెన్ షకీల్ బట్ కన్నీటి పర్యంతమయ్యాడు.
లాహోర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన షకీల్ బట్.. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ పాలనా వైఫల్యాలపై అసహనం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాలో వంటగదిని శుభ్రం చేయడంతో పాటు పాత్రలు కడగాల్సి వచ్చిందని చెప్పాడు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో విజయాలు ఎలా సాధిస్తామని ప్రశ్నించాడు. ప్రస్తుత హాకీ పాలక వర్గంతో ముందుకు సాగలేమని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా పర్యనటకు వెళ్లిన పాకిస్థాన్ హాకీ టీమ్‌కు సరైన వసతులు లభించలేదు. సిడ్నీ విమానాశ్రయంలో దిగిన పాక్ ఆటగాళ్లకు 13 గంటల పాటు ఆకలి, దప్పికలతో అలమటించారు. హోటల్‌కు వెళ్లగా.. ముందస్తు చెల్లింపులు జరగలేదని గదులు ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో పాక్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా వీధుల్లో నిరాశ్రయులై తిరిగారు. అనంతరం వారికి బస లభించింది.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజే జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3-2తో పాకిస్థాన్ చిత్తయ్యింది. ఆ తర్వాత జర్మనీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు ఈ పర్యటన కోసం హాకీ ఫెడరేషన్‌కు సుమారు కోటి రూపాయలు వరకు కేటాయించింది. కానీ, నిధుల ఖర్చుపై అడ్మినిస్ట్రేషన్ స్పష్టత ఇవ్వలేదని షకీల్ బట్ తెలిపాడు. 13 రోజులు బస చేయాల్సిన చోట కేవలం 10 రోజులకే హోటల్ బుకింగ్ చేశారని, చివరి మూడు రోజులు చౌకైన హోటళ్లకు తరలించారని ఆరోపించాడు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మీడియాతో మాట్లాడితే క్రమశిక్షణా చర్యల బెదిరింపులు ఉంటాయని తెలిసినా.. ఆస్ట్రేలియాలో పడ్డ అవమానాన్ని షకీల్ బట్ ధైర్యంగా బయటపెట్టాడు. ఆటగాళ్లు మైదానంలో చెమట కన్నా కన్నీళ్లే ఎక్కువగా చిందించారని ఈ ఘటన తేటతెల్లం చేసింది.
క్రికెట్‌లో రాజకీయం చేస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం.. జాతీయ క్రీడ హాకీని నిర్లక్ష్యం చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షకీల్ బట్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.