ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0తో ఓడించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్‌ను 5-1తో చిత్తు చేసింది.
బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 8-1 తేడాతో మలేసియాను మట్టికరిపించింది. భారత్ తరఫున రాజ్‌కుమార్ పాల్(3వ, 25వ, 33వ నిమిషం) మూడు గోల్స్ నమోదు చేయగా ... అరైజీత్ సింగ్ హుందాయ్(6వ, 39వ నిమిషం) రెండు గోల్స్ చేశాడు. జుగ్‌రాజ్ సింగ్(7వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్(22వ నిమిషం), ఉత్తమ్ సింగ్( 40వ నిమిషం) తలో గోల్స్ కొట్టారు.

ఈ మ్యాచ్‌లో మూడు క్వార్టర్స్‌లో గోల్స్ నమోదు చేసి రాజ్ కుమార్ హ్యాట్రిక్ సాధించగా.. తొలి, మూడో క్వార్టర్స్‌లో హుందాయ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్ రాజ్ సింగ్ గోల్స్ నమోదు చేయగా.. ఉత్తమ్ చివరి గోల్‌ను కొట్టాడు.
భారత ప్రదర్శన ముందు మలేసియా తేలిపోయింది. మ్యాచ్ ఆసాంతం బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న భారత్.. పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసి ఉక్కిరి బిక్కిరి చేసింది. భారత ఆటగాళ్ల ధాటికి మలేసియా డిఫెండర్స్ వద్ద సమాధానం లేకపోయింది. సెప్టెంబర్ 12న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో భారత్.. దక్షిణ కొరియాతో తలపడనుంది.