ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో భారత పురుషుల హాకీ టీమ్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ టీమ్.. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
ఈ గెలుపుతో భారత్ ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్(13వ, 19వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. పాకిస్థాన్ తరఫున అహ్మద్ నదీమ్(8వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

భారత్, పాకిస్థాన్‌తో పాటు కొరియా సెమీస్ బెర్త్ దక్కించుకోగా.. మరో బెర్త్ కోసం మలేసియా, చైనా మధ్య పోటీ నెలకొంది. జపాన్ తమ తదుపరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మలేసియా ముందడుగు వేస్తోంది. లేదంటే చైనాకు అవకాశం దక్కుతుంది.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ దుమ్మురేపింది. మ్యాచ్ ఆరంభంలోనే పాకిస్థాన్ గోల్ నమోదు చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మిడిల్ నుంచి హన్నన్ షాహిద్ ఇచ్చిన పాస్‌ను అహ్మద్ నదీమ్ గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
పాకిస్థాన్‌కు చెందిన అజాజ్ అహ్మద్ గ్రీన్ కార్డ్ ఎదుర్కోవడంతో పాటు భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. అజాజ్ అహ్మద్ కాసేపు మైదానం వీడటంతో పాకిస్థాన్ 10 మంది ఆటగాళ్లతోనే ఆటను కొనసాగించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోర్లను 1-1తో సమం చేశాడు.
సెకండ్ క్వార్టర్ ప్రారంభంలోనే భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించగా.. స్పెషలిస్ట్ హర్మన్‌ప్రీత్ సింగ్ 19వ నిమిషంలో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఈ గోల్ క్రెడిట్ మాత్రం ఉత్తమ్‌దే. అతనివల్లే భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. ఆ తర్వాత ఇరుజట్లు గోల్స్ కోసం హోరా హోరీగా తలపడ్డాయి. పాకిస్థాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌లను భారత డిఫెన్స్ విభాగం అద్భుతంగా అడ్డుకుంది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్.. దాయాదీ పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.
ఈ టోర్నీ చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై3-1 తేడాతో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ భారత్.. పాక్‌పై 2-1తో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.