ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ హాకీ టీమ్ భారత్‌లో పర్యటించనుంది. ఇందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. భారత హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కావాల్సిన అన్ని అనుమతులు లభించాయని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా ఆసియా కప్ హాకీ టోర్నీ 2025 జరగనుంది. ఆసియా కప్‌తో పాటు తమిళనాడులోని మధురై వేదికగా జరగనున్న ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ వరల్డ్ కప్‌లో కూడా పాకిస్థాన్ జట్టు పాల్గొనేందుకు అనుమతి లభించిందని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
పాకిస్థాన్ హాకీ ఆటగాళ్ల వీసాల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని హాకీ ఇండియాకు కూడా తెలియజేసినట్లు సమాచారం. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు పాల్గొననున్నాయి.

'భారత్ వేదికగా అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే ఏ జట్టుకు కూడా మేం వ్యతిరేకం కాదు. కానీ ద్వైపాక్షిక మ్యాచ్‌లు వేరు. ఆసియా కప్, జూనియర్ హాకీ వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్లు భారత్‌కు వస్తాయి. ఇందుకు కావాల్సిన అనుమతులన్నీ లభించాయి. భారత్.. ఒలింపిక్ చార్టర్‌ను అనుసరించాల్సి ఉంది. పోటీలో పాల్గొనకుండా ఓ దేశాన్ని మేం అడ్డుకోలేం'అని క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపాడు.
భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌ల విషయంలో క్రీడా దౌత్యాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రం అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ రెండు హకీ టోర్నీల్లో పాకిస్థాన్ పాల్గొనకుండా భారత్ అడ్డుకొని ఉంటే.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఆగ్రహానికి గురయ్యేది.తాజా నిర్ణయంతో భారత్ వేదికగా జరిగే ఇతర క్రీడా ఈవెంట్స్‌లో కూడా పాకిస్థాన్ పాల్గొనేందుకు మార్గం సుగుమమైంది. తాజా నిర్ణయంతో ఆసియా కప్ క్రికెట్ టోర్నీ 2025లో భారత్-పాక్ జట్లు తలపడే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినా.. రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.