
హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రొయేషియా మేటి జట్లను ఓడించి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రొయేషియా దేశ ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
క్రొయేషియా వ్యాప్తంగా తమ జట్టుకు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఏ వీధిలో చూసినా అభిమానులు ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లు ధరించే జెర్సీలు ధరించి కనిపిస్తున్నారు. తాజాగా క్రొయేషియా జట్టుకు మద్దతుగా ఆ దేశ ప్రధాని, మంత్రులు కూడా జెర్సీలు ధరించారు.
గురువారం క్రొయేషియా ప్రభుత్వం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశానికి ఆ దేశ ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్ జెర్సీ ధరించి హాజరయ్యారు. ప్రధానితో పాటు మంత్రులు కూడా ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు ధరించే జెర్సీలను ధరించి సమావేశానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని ఆండ్రెజ్ మాట్లాడుతూ "సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన మన జట్టు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది. చిన్న దేశానికి ఇదో గొప్ప విజయం. చాలా సంతోషంగా ఉంది. ఫైనల్ కూడా గెలవాలని ఆకాంక్షిస్తున్నా" అని అన్నారు.
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం లుజ్నికీ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్ ఆట ప్రారంభమైన 5 నిమిషాలకే ఇంగ్లాండ్ ఆటగాడు కీరన్ ట్రిప్పర్ గోల్‌కొట్టి తమ జట్టును ఆధిక్యంలో నిలిపాడు.
దీంతో తొలి అర్దభాగంలో ఒకే ఒక్క గోల్ నమోదైంది. ఇక, రెండో అర్ధభాగంలో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెరిసిక్ 68వ నిమిషంలో గోల్ కొట్టి జట్టు స్కొరును సమం చేశాడు. ఇక అదనపు సమయంలో మారియో మండ్జుకిక్ 109 నిమిషంలో గోల్ చేసి క్రొయేషియాను విజయ తీరాలకు చేర్చాడు.
1998 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరుకోవడమే క్రొయేషియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. కాగా, అంతకముందు క్వార్టర్ ఫైనల్లో రష్యాపై విజయం సాధించిన సమయంలో క్రొయేషియా అధ్యక్షురాలు కొలింద జట్టు జెర్సీ ధరించి ఆటగాళ్లతో కలిసి సంబరాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ వరల్డ్ కప్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరిన జట్టుగా క్రొయేషియా నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో క్రొయేషియా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది.