యూరో కప్‌ను ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ విజయంతో మొదలుపెట్టాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్.. హంగేరిపై విజయం సాధించగా.. గ్రూప్-బీలో క్రోయేషియాపై స్పెయిన్, అల్బేనియాపై ఇటలీ గెలుపొందాయి.
హంగేరీ వర్సెస్ స్విట్జర్లాండ్(గ్రూప్-ఏ) స్విట్జర్లాండ్ 3-1 తేడాతో హంగేరిని చిత్తు చేసింది. కోల్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్విస్ స్టార్ క్వాడ్వో తొలి గోల్ నమోదు చేశాడు. ఆ వెంటనే మైకేల్ గోల్‌తో డబుల్ చేశాడు. హంగేరి తరఫున బార్నబస్ వర్గా గోల్ చేసినా.. బ్రీల్ ఎంబోల్ మరో గోల్ కొట్టి స్విట్జర్లాండ్ ఆధిక్యాన్ని పెంచాడు.

స్పెయిన్ వర్సెస్ క్రోయేషియా(గ్రూప్-బి)
గ్రూప్ బిలో భాగంగా బెర్లిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో క్రోయేషియాను ఓడించింది. స్పెయిన్ తరఫున అల్వరో మోరాట(29వ నిమిషం), ఫాబియన్ రూజ్(32వ నిమిషం), డాని కర్వాజల్(45+2వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు స్పెయిన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఇటలీ వర్సెస్ అల్బేనియా(గ్రూప్-బీ)
గ్రూప్-బీలో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇటలీ 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 22 సెకండ్లలోనే అల్బేనియా స్టార్ నెదిమ్ బజ్రామి గోల్ చేశాడు. యూరో టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగంగా గోల్ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
11వ నిమిషంలో ఇటలీ స్టార్ అలెస్సాండ్రో బస్టోని గోల్ చేయగా.. 5 నిమిషాల వ్యవధిలోనే నికోలా బరెల్లా మరో గోల్ చేసి ఇటలీ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. ఆ తర్వాత గోల్స్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఇటలీ బోణీ కొట్టింది.
యూరో 2024లో నేటి మ్యాచ్‌లు..
పోలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్(గ్రూప్ డీ)-6.30 గంటలకు
స్లోవెనియా వర్సెస్ డెన్మార్క్(గ్రూప్ సీ)- 9.30 గంటలకు
సెర్బియా వర్సెస్ ఇంగ్లండ్(గ్రూప్-సీ)-12.30 గంటలకు