FIFA World Cup చరిత్రలోనే సంచలన ఫలితాలు!
సాకర్ ఉత్సవానికి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో పుట్‌బాల్ ప్రపంచకప్ ఆరంభం కానుంది. అయితే ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఎన్నో జట్లు సంచలన విజయాలు నమోదు చేశాయి. దిగ్గజ జట్లను సైతం మట్టికరిపించి ఔరా అనిపించాయి. అలా
అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తిన టాప్ సంచలన ఫలితాలపై ఓ లుక్కెద్దాం
1. యూఎస్ఏ 1-0 ఇంగ్లండ్ (1950)
1950 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. నాటి యూఎస్ఏ జట్టులో పోస్ట్‌మ్యాన్, డ్రైవర్, డిష్‌వాషర్ వంటి పార్ట్-టైమ్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. న్యూయార్క్‌లో డిష్‌వాషర్‌గా పనిచేసే జో గేట్‌జెన్స్ 38వ నిమిషంలో చేసిన ఏకైక గోల్‌తో అమెరికా చారిత్రాత్మక విజయం సాధించింది.
2. వెస్ట్ జర్మనీ 3-2 హంగేరి (1954)
1954 ప్రపంచకప్‌లో వెస్ట్ జర్మనీ సాధించిన ఈ విజయాన్ని "మిరాకిల్ ఆఫ్ బెర్న్" అని పిలుస్తారు. నాటి కాలంలో అత్యంత బలమైన జట్టుగా గుర్తింపు పొంది, వరుస విజయాలతో దూసుకుపోతున్న హంగేరిపై వెస్ట్ జర్మనీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ మ్యాచ్‌లో జర్మనీని 8-3తో ఓడించిన హంగేరి.. ఫైనల్లోనూ 2-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. కానీ జర్మనీ అద్భుతంగా పుంజుకుని 3-2తో టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విజయం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ పునర్నిర్మాణానికి ఒక కొత్త ఊపునిచ్చింది.

3. నార్త్ కొరియా 1-0 ఇటలీ (1966)
తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన నార్త్ కొరియా.. ఫుట్‌బాల్ దిగ్గజం ఇటలీని 1-0తో ఓడించి సంచలనం సృష్టించింది. మిలిటరీ కార్పోరల్ అయిన పార్క్ దో-ఇక్ ఫస్ట్ హాఫ్‌కు మూడు నిమిషాల ముందు ఈ చారిత్రాత్మక గోల్ కొట్టారు.
4. నార్తర్న్ ఐర్లాండ్ 1-0 స్పెయిన్ (1982)
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశమైన నార్తర్న్ ఐర్లాండ్, ఆతిథ్య స్పెయిన్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించింది. మ్యాచ్ 51వ నిమిషంలో జెర్రీ ఆర్మ్‌స్ట్రాంగ్ కొట్టిన లో-గోల్ నార్తర్న్ ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
5. సెనెగల్ 1-0 ఫ్రాన్స్ (2002)
డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సెనెగల్ షాకిచ్చింది. పాపా బౌబా దియోప్ 30వ నిమిషంలో చేసిన గోల్‌తో సెనెగల్ గెలిచింది. ఎల్ హాడ్జీ దియూఫ్ తన వేగంతో ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ముక్కలు చేసి ఈ గోల్‌కు అసిస్ట్ అందించాడు.
6. నెదర్లాండ్స్ 5-1 స్పెయిన్ (2014)
2010 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి నెదర్లాండ్స్ ఘోరమైన ప్రతీకారం తీర్చుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్ మొదట ఆధిక్యం సాధించినప్పటికీ, రాబిన్ వాన్ పెర్సీ, అర్జెన్ రాబెన్‌ల చెరో రెండు గోల్స్‌తో నెదర్లాండ్స్ 5-1తో స్పెయిన్‌ను చిత్తు చేసింది.
7. మొరాకో 1-0 పోర్చుగల్ (2022)
క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించి, ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్, అరబ్ దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. యూసఫ్ ఎన్-నెసిరి హెడర్ ద్వారా చేసిన గోల్ మ్యాచ్ విజేతగా నిలిచింది. ఈ ఓటమితో రొనాల్డో ప్రపంచకప్ కల కన్నీళ్లతో ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

