
దోహా: భారత ఫుట్‌బాల్ టీమ్ గోల్-మెషీన్ సునీల్ ఛెత్రీ మరో రికార్డుపై కన్నేశాడు. యాక్టివ్ ప్లేయర్లలో హయ్యెస్ట్ స్కోరర్‌గా అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని దాటేసిన ఛెత్రీ మరో ఒక్క గోల్ చేస్తే ఆల్‌టైమ్ టాప్ 10లో ప్లేస్ దక్కించుకుంటాడు. ఫిఫా ప్రపంచకప్ (2022), 2023 ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్‌లో భాగంగా నేడు(మంగళవారం) జరిగే సెకండ్ రౌండ్ చివరి మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించడంతో పాటు ఈ రికార్డు అందుకోవడమే టార్గెట్‌గా ఛెత్రి బరిలోకి దిగుతున్నాడు. గత పోరులో బంగ్లాను ఓడించిన ఛెత్రి సేన జోరు మీదుంది. మరోవైపు తమ చివరి మ్యాచ్‌లో అఫ్గాన్.. ఒమన్ చేతిలో ఓడింది. దాంతో.. ఈ మ్యాచ్‌లో డ్రా చేసుకున్నా కూడా భారత్ ఆసియా క్వాలిఫయర్స్‌లో మూడో రౌండ్‌కు చేరుకుంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ గోల్స్‌తో భారత జట్టును గెలిపించిన గోల్స్ మెషీన్ సునీల్ ఛెత్రీ.. అంతర్జాతీయ గోల్స్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని అధిగమించాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో 103 ఇంటర్నేషనల్ గోల్స్‌తో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా.. మెస్సీ (72)ని దాటేసి ఛెత్రీ (74) రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆఖర్లో ఛెత్రీ గోల్ కొట్టి ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఆరేళ్ల తర్వాత టీమిండియాకు తొలి విజయం అందించాడు. 79వ నిమిషంలో ఎడమవైపు నుంచి ఆషిక్ కురునియన్ ఇచ్చిన క్రాస్‌ను దూరం నుంచి అతను గోల్‌గా మలిచాడు.
గోల్స్ పరంగా మెస్సీ కన్నా రెండు, అలీ మబ్‌కౌత్ (73) కన్నా ఒక స్థానం ముందంజలో ఛెత్రీ నిలిచాడు. గత గురువారం చిలీతో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లో మెస్సీ 72వ గోల్ చేశాడు. మలేసియాతో మ్యాచులో మబ్‌కౌత్ 73వ గోల్ చేయడం గమనార్హం. ఇక ఆల్‌టైమ్ టాప్-10లో ప్రవేశించేందుకు ఛెత్రీ కేవలం ఒకేఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. శాండర్ కోసిస్ (హంగేరి), కునిషిగె కుమమోటో (జపాన్), బషర్ అబ్దుల్లా (కువైట్ ) 75 గోల్స్‌తో అతడి కన్నా ముందున్నారు.
తాను చేసిన గోల్స్ ఎప్పుడూ లెక్కించుకోనని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ చెప్పాడు. జట్టుగా తామెప్పుడూ విజయం సాధించేందుకే శ్రమిస్తామని అన్నాడు. 74 గోల్స్ చేసిన ఛెత్రీపై భారత హెడ్‌కోచ్ ఇగోర్ స్టిమాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు 25 ఏళ్ల యువ ఆటగాడిలా ఎంతో ఉత్సాహం, సామర్థ్యంతో ఆడుతున్నాడని అన్నాడు. అత్యుత్తమాన్ని మించి రాణిస్తున్నాడని పొగిడాడు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ బైచింగ్ భూటియాతో పాటు పలువురు ఆటగాళ్లు ఛెత్రీని ప్రశంసించారు.