
హైదరాబాద్: రష్యా ఆతిథ్యమిస్తోన్న 21వ ఫిఫా వరల్డ్ కప్ వీక్షించేందుకు గాను సెర్బియాకు చెందిన మిక్కీ స్టానిస్లవ్ అనే అభిమాని కేవలం మూడు గంటల్లో బెల్‌గ్రేడ్ నుంచి మాస్కోకు చేరుకున్నాడు. అదే నాలుగేళ్ల క్రితం బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ కప్ కోసం తాను 22 గంటలు పాటు విమాన ప్రయాణాన్ని చేసినట్లు చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
అందుకు టెక్నాలజీనే కారణమని మిక్కీ స్టానిస్లవ్ వెల్లడించాడు. అంతేకాదు రష్యా ఆతిథ్యమిస్తోన్న వరల్డ్ కప్‌లో ఏర్పాట్లు కూడా బాగున్నాయని, అతి తక్కువ సమయంలోనే మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేసేందుకు సాధ్యపడుతుందని తెలిపాడు. గురువారం ప్రారంభమైన వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై ఆతిథ్య రష్యా 5-0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తాను ఫిఫా వరల్డ్ కప్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకున్న వెంటనే బెల్‌గ్రేడ్ నుంచి మాస్కోకి బయల్దేరినట్లు మిక్కీ స్టానిస్లవ్ వెల్లడించాడు. "ఇది వరల్డ్ కప్, ఇక్కడికి ప్రపంచం నలుమూలుల నుంచి పెద్ద మొత్తంలో అభిమానులు వస్తుంటారు" అని మాస్కోలోని జైతన్యా వీధిలో ఉన్న టికెట్ కలెక్షన్ వద్ద క్యూలో నిలబడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
ఆరంభ మ్యాచ్ టికెట్లను రష్యా, సౌదీ అరేబియాకు చెందిన అభిమానులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేయగా.... రెండో రోజు నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను లాటిన్ అమెరికాకు చెందిన సాకర్ అభిమానులు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు.

పెరూకి చెందిన అభిమానులు తన అభిమాన కెప్టెన్ పోలో గుఎర్రెరో ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను పెద్దఎత్తున మాస్కోకు చేరుకున్నారు. ఎందుకంటే పోలో గుఎర్రెరో వయసు దృష్ట్యా ఇదే చివరి వరల్డ్ కప్ కానుంది. కొందరైతే ఆరంభ మ్యాచ్ టికెట్లను ఫిఫా అధికారిక వెబ్‌సైట్ ఉంచిన ధర కంటే మూడు రెట్లు అధికంకగా అమ్ముతుండటం విశేషం.
ఇక, బ్రెజిల్ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు అయితే $1000 ధరకు బయ్యర్లు టికెట్ కలెక్షన్ సెంటర్ల బయటే అమ్ముతుండటం విశేషం. దీంతో వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలుల నుంచి వచ్చిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లను కూడా అక్కడి స్థానికులు బ్లాక్‌లో అమ్ముతుండటం ఏంటని మండిపడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక మాస్కో నగరంలో ఏర్పాటు చేసిన ఫిఫా ఫ్యాన్ పార్కుల వద్ద మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. దీంతో వోరోబియో గోరీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లో ఆరంభ మ్యాచ్‌ని సుమారు 25,000 మంది వరకు వీక్షించారు.
ఫ్యాన్ పార్కుకు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో బారికేడ్లను దాటుకుని ఫ్యాన్ పార్కులోకి వెళ్లేందుకు అభిమానులు సాహాసించలేదు. ఇదిలా ఉంటే, గురువారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభ కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి.

ముందుగా 2010 ప్రపంచకప్ విజేత స్పెయిన్ జట్టు సారథి కాసిలాస్, మోడల్ నటాలియా ఒడియనోవా కలిసి పెట్టెలో ఉన్న ప్రపంచకప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చారు. తర్వాత దాన్ని తెరిచి స్టేడియంలోని అభిమానులకు కప్పును చూపారు. అనంతరం బ్రిటిష్ పాప్ గాయకుడు రాబీ విలియమ్స్ స్టేడియంలోకి అడుగుపెట్టాడు.
వేదిక దగ్గరికి వచ్చే ముందే అతను గట్టిగా అరుస్తూ అభిమానుల్ని ఉత్సాహ పరిచాడు. తర్వాత కళాకారులతో కలిసి అతను సంగీత ప్రదర్శన ఇచ్చాడు. అతడికి రష్యా గాయని ఐదా కూడా తోడైంది. రష్యా సంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించారు. బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు రొనాల్డో ఓ పిల్లాడితో కలిసి మైదానంలోకి విచ్చేశాడు.

మ్యాచ్ అధికారిక బంతిని మోడల్ విక్టోరియా లొపిరెవా జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి తీసుకురాగా, స్పెయిన్ మాజీ గోల్‌కీపర్ ఐకర్‌కాసిల్లాస్ ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించాడు. రాక్ డీజే శబ్దాల హోరులో 'మిమ్మల్ని ఆనందింపజేయనివ్వండి (లెట్ మి ఎంటర్‌టైన్ యు)' అంటూ రాబి విలియమ్స్ పాడిన పాట ఉర్రూతలూగించింది.
మధ్యలో రష్యా మోడల్ లొపిరెవా అతడితో గొంతు కలిపింది. 800 మంది కళాకారులు పాల్గొన్న ఈ వేడుక, గతానికి భిన్నంగా అరగంట పాటే సాగింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ఆ సమయంలో బాణసంచా వెలుగులతో స్టేడియం కళకళలాడింది. ఆపై ఫిఫా అధ్యక్షుడు లియాని ఇన్ఫాంటినో ప్రసంగించాడు. కొన్ని నిమిషాలకే ఆరంభ మ్యాచ్ మొదలైంది.
(myKhel.com కరస్పాండెంట్ అరవింద్ ఎస్ ప్రస్తుతం రష్యా నుంచి ఫిఫా వరల్డ్ కప్‌ను కవర్ చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ కోసం క్యూలో నిల్చుకున్న ఫిఫా ఆవేదన ఇది)