అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో పోరులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున బరిలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి.. పెనాల్టీ షూటౌట్‌లో గోల్ నమోదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ స్కిల్స్‌కు ఫిదా అయిన మెస్సీ.. చప్పట్లతో ప్రత్యేకంగా అభినందించాడు. అపర్ణ టీమ్ తరఫున బరిలోకి దిగిన మెస్సీ.. రెండు గోల్స్ నమోదు చేశాడు. 20 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఐదు నిమిషాలు ఉండగా మెస్సీ, రేవంత్ మైదానంలోకి అడుగుపెట్టారు.

రేవంత్ రెడ్డి బరిలోకి దిగకముందే ఆర్‌ఆర్9 టీమ్ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. రేవంత్ రెడ్డి ఒక గోల్ చేయడంతో 4-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మెస్సీ రెండు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ఆర్‌ఆర్ 9 టీమ్‌కు మెస్సీ టైటిల్ అందించాడు.
అనంతరం మైదానం మొత్తం తిరిగి ప్రేక్షకులకు మెస్సీ అభివాదం చేశాడు. ఇరు జట్లతో కలిసి ఫొటో దిగాడు. ఫుట్‌బాల్స్‌ను ప్రేక్షకుల్లోకి కిక్ చేశాడు. మెస్సీ అభివాదంతో ప్రేక్షకులు సంతోషంతో ఎగిరి గంతేసారు.
గోట్ టూర్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మెస్సీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ అభిమానులతో నిర్వహించిన ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఘనంగా స్వాగతం పలికారు. ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం చేరుకొని సరదాగా కాసేపు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రియాంక గాంధీ కుమారుడు, కూతురు కూడా ఈ మ్యాచ్‌కు వచ్చారు.
ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సిద్దమైన సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఆడిన సీఎం రేవంత్.. మెస్సీతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌కు తెలంగాణ మంత్రులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.