భారత ఫుట్‌బాల్ టీమ్ వరుస పరాజయాల నేపథ్యంలో హెడ్ కోచ్ మనోలో మార్క్వెజ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్‌ఎఫ్) అంగీకరంతోనే మార్క్వెజ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఏఎఫ్‌సీ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత్ 0-1 తేడాతో హాంకాంగ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఘోర పరాజయం ఎదురైన కొద్ది రోజులకే మార్క్వెజ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. గతేడాది జూన్‌లో ఫుట్‌బాల్ కోచ్‌గా మార్క్వెజ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఒప్పందం ప్రకారం అతనికి ఇంకా ఏడాది సమయం ఉన్నా.. వరుస పరాజయాల నేపథ్యంలో తప్పుకున్నాడు. అతని అభ్యర్థనను భారత ఫుట్‌బాల్ సమాఖ్య అంగీకరించింది.
ఈ విషయాన్ని ఏఐఎఫ్‌ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ సత్యనారయణ ధృవీకరించారు. 'కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని మార్క్వెజ్ చేసిన అభ్యర్థనను ఏఐఎఫ్‌ఎఫ్ అంగీకరించింది. ఎలాంటి ఆర్థికరమైన చిక్కులు తలెత్తకుండా పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే భారత ఫుట్‌బాల్ కోచ్ పదవి కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తాం.'అని సత్యనారయణ పీటీఐకి తెలిపారు.
ఏఎఫ్‌సీ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత మార్క్వెజ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 'ఈ ఓటమి తీవ్రంగా బాధించింది. ఈ ఓటమితో డ్రెస్సింగ్ రూమ్ స్మశానంలా మారింది. అయితే ఈ టోర్నీకి అర్హత సాధించే అవకాశాలు ఇంకా భారత జట్టుకు ఉన్నాయి. మా ఆటగాళ్ల ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. నాకు చాలా కోపం వస్తుంది. నాకు మాటలు రావడం లేదు.'అని మార్క్వెజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మార్క్వెజ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్.. 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్కటి గెలిచింది.

ప్రస్తుతం భారత ఫుట్‌బాల్ టీమ్ గడ్డు కాలం ఎదుర్కొంటుంది. గతేడాదిగా జట్టు ప్రదర్శన అధ్వాన్నంగా మారింది. గతేడాది ఖాతర్ వేదికగా జరిగిన ఏఫ్‌సీ ఆసియా కప్ 2024లో గ్రూప్ స్టేజ్ నుంచే భారత్ నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 2023లో ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 99వ స్థానంలో ఉన్న భారత్.. పేలవ ప్రదర్శనతో ప్రస్తుతం 127వ స్థానానికి పడిపోయింది. మాజీ హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ఆధ్వర్యంలో 2023 నవంబర్‌లో కువైట్‌పై విజయం సాధించిన తర్వాత భారత ఫుట్‌బాల్ టీమ్ మళ్లీ విజయం సాధించలేదు. భారత దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ, అది జట్టు అదృష్టాన్ని మార్చలేకపోయింది.