అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లియోనల్ మెస్సీ కోల్‌కతాలో పర్యటించిన సంగతి తెలిసిందే. సాల్ట్‌లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీ 10 నిమిషాల్లోనే వెనుదిరిగాడు. దాంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మెస్సీ 10 నిమిషాల్లోనే వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెస్సీని చూసేందుకు భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు.. అతను త్వరగా వెళ్లిపోవడంతో విధ్వంసం సృష్టించారు. మైదానంలోకి దూసుకొచ్చి కుర్చీలు విరగ్గొడుతూ.. బాటిల్స్ విసిరేస్తూ రచ్చరచ్చ చేశారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మెస్సీతో పాటు అతని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 'ఈ రోజు స్టాక్‌లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న ఘటనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఫుట్‌బాల్ స్టార్ మెస్సీని చూసేందుకు వచ్చిన వేలాది మంది క్రీడాభిమానులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను స్టేడియానికి బయలుదేరా. ఈ క్రమంలో అక్కడి పరిస్థితి తెలిసి వెనుదిరిగా. స్టేడియంలో జరిగిన ఘటనకు మెస్సికి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా'అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఈ ఘటన రాజకీయంగా దుమారం రేగింది. మమతా ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. శనివారం ప్రారంభమైన మెస్సీ పర్యటన సోమవారం ముగియనుంది. మూడు రోజుల పాటు భారత్‌లో ఉండనున్న మెస్సీ.. కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో పర్యటించనున్నాడు.
మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సహచర ఆటగాళ్లు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ వస్తున్నారు. ఈ టూర్‌లో మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలెబ్రిటీలను కలవనున్నాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌కు తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.