మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ముందే ఫడ్నవీస్‌కు నిరసన సెగ తగిలింది. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా ఆదివారం ముంబై నగరానికి వచ్చిన మెస్సీ.. వాంఖడే క్రికెట్ స్టేడియంలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు.
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ, సెలెబ్రిటీ టీమ్ మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను వీక్షించిన మెస్సీ.. అనంతరం ముంబై అభిమానులకు అభివాదం చేశారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు సునీల్ ఛెత్రీతో ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ సందర్భంగా మెస్సీకి సచిన్ తన 2011 వరల్డ్ కప్ ఫైనల్ జెర్సీని బహుకరించాడు. మెస్సీ కూడా సాకర్ ప్రపంచకప్‌లో గోల్ కొట్టిన బంతిని సచిన్‌కు అందజేశాడు.

ఒకే వేదికపై మెస్సీ, సచిన్, సునీల్ ఛెత్రీలను చూసిన అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. అయితే ఈ కార్యక్రమం చివర్లో దేవేంద్ర ఫడ్నవీస్ మైక్ పట్టుకొని మాట్లాడుతుండగా.. అభిమానుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. క్రీడా ఈవెంట్‌లో ఫడ్నవీస్.. తమ ప్రభుత్వం చేపట్టబోతున్న 'ప్రాజెక్ట్ మహాదేవ్' గురించి మాట్లాడగా.. అభిమానులు పెద్ద ఎత్తున నిరసనను వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఫడ్నవీస్ ప్రకటించిన ప్రాజెక్ట్ మహాదేవ్ ప్రేక్షకుల్లోని కొందరికి నచ్చలేదు. దాంతో వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన ఫడ్నవీస్ సమయస్పూర్తితో వ్యవహరించారు. వెంటనే గణపతి బప్పా అనే నినాదాలు ఇవ్వగా.. ప్రేక్షకులు మోర్య అని ప్రతిస్పందించారు. దాంతో అభిమానుల నిరసనలు ఆగిపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇప్పటికే కోల్‌కతా, హైదరాబాద్‌లో పర్యటించిన మెస్సీ.. ఆదివారం ముంబైలో సందడి చేశాడు. సోమవారం న్యూఢిల్లీలో పర్యటించనున్నాడు. అక్కడ అతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంతో పాటు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతాడు. ఈ కార్యక్రమంతో మెస్సీ భారత పర్యటన ముగుస్తుంది.