తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్ నగర ఆతిథ్యానికి అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిదా అయ్యాడు. హైదరాబాద్ ప్రేక్షకుల ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు. సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి మెస్సీ మాట్లాడాడు. భారత్‌లో పర్యటించడం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నాడు.
'నమస్కారం.. అంతా బాగానే ఉంది. ఈ రోజు నాపై మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నిజాయితీగా చెప్పాలంటే.. నేను ఇక్కడికి రాకముందు.. గత ప్రపంచ కప్ సందర్భంగా చాలా విషయాలు చూశాను. ఏది ఏమైనా మీరందరూ చూపిన ఆప్యాయతకు చాలా ధన్యవాదాలు. భారత్‌లో పర్యటించడం మాకు దక్కిన ఒక గౌరవం. ఇందుకు నేను చాలా కృతజ్ఞుడను. ధన్యవాదాలు'అని మెస్సీ తన ప్రసంగాన్ని ముగించాడు. మెస్సీకి రేవంత్ రెడ్డి జ్ఞాపికను అందజేశారు.

గోట్ టూర్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా లియోనల్ మెస్సీ ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ బరిలోకి దిగాడు. ఏడుగురు ఆటగాళ్ల చొప్పున 20 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో లియోనల్ మెస్సీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోటీపడ్డారు. సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున రేవంత్ రెడ్డి, అపర్ణ టీమ్ తరఫున మెస్సీ బరిలోకి దిగారు. చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఆడిన ఈ ఇద్దరూ తమ ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
పెనాల్టీ షూటౌట్‌లోని రేవంత్ రెడ్డి ఒక గోల్ చేయగా.. మెస్సీ రెండు గోల్స్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌పై రేవంత్ రెడ్డి ఆర్‌ఆర్ టీ జట్టు విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఆర్‌ఆర్ 9 టీమ్‌కు మెస్సీ టైటిల్ అందించాడు. అనంతరం మైదానం మొత్తం తిరిగి ప్రేక్షకులకు మెస్సీ అభివాదం చేశాడు. ఇరు జట్లతో కలిసి ఫొటో దిగాడు. ఫుట్‌బాల్స్‌ను ప్రేక్షకుల్లోకి కిక్ చేశాడు. మెస్సీ అభివాదంతో ప్రేక్షకులు సంతోషంతో ఎగిరి గంతేసారు.
ఈ మ్యాచ్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. మెస్సీని చూసేందుకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో ఉప్పల్ స్టేడియానికి వచ్చారు.