
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్‌ఎఫ్‌సీ) రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై మ్యాచ్ ఆడనుంది. ఐఎస్‌ఎల్ 2022-23 సీజన్‌లో భాగంగా హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీని హైదరాబాద్ ఎఫ్‌సీ ఢీకొట్టనుంది.
ముంబై సిటీ ఎఫ్‌సీతో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న హైదరాబాద్ ఎఫ్‌సీ.. నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ గెలుపు జోరుతోనే సొంతగడ్డపై బెంగళూరును మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల జరిగిన డ్యురాండ్ కప్‌లో బెంగళూరు చేతిలో హైదరాబాద్‌కు పరాజయం ఎదురైంది. ఇప్పుడు ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ ఎఫ్‌సీ భావిస్తోంది.
ఒగ్బాచె, జావో విక్టర్, సెవెరియో, హాలీ చరణ్, బోరా హెరెరాతో హైదర్‌బాద్ పటిష్టంగా ఉంది. ఇండియా సూపర్ స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి, రాయ్‌కృష్ణ, అలెన్ కోస్టాతో బెంగళూరు ఎఫ్‌సీ కూడా అంతే బలంగా కనిపిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఆశించొచ్చు. 'లీగ్‌లో బెంగళూరు బలమైన జట్టు. ఆ టీమ్ కఠిన సవాల్‌కు మేం రెడీ'అని శుక్రవారం మీడియా సమావేశంలో హెచ్‌ఎఫ్‌సీ కోచ్ మనాలో మార్మ్వెజ్ చెప్పాడు.
గత మార్చిలో ముగిసిన ఐఎస్‌ఎల్ 2021-22 సీజన్ టైటిల్‌ను హైదరాబాద్ ఎఫ్‌సీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అరంగేట్ర చేసిన మూడో సీజన్‌లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి సంచనాలు నమోదు చేస్తూ దూసుకొచ్చిన నవాబుల జట్టు అత్యంత హోరాహోరీగా సాగిన అంతిమ పోరులోనూ అసాధారణ ఆట చూపెట్టింది. మూడో సారి ఫైనల్ ఆడుతున్న కేరళ బ్లాస్టర్ విసిరిన సవాల్‌ను తమదైన ఆటతో ఛేదించింది. మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 0-1తో ఓటమి అంచుల్లో నిలిచిన దశ నుంచి ఫుంజుకున్న హైదరాబాద్ ఎఫ్‌సీ.. కేరళను షూటౌట్ చేసి తొలి టైటిల్ ముద్దాడింది.