
పనాజి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 2-1తో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. తద్వారా టోర్నీలో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బెంగళూరు తరఫున కెప్టెన్ సునీల్ ఛెత్రి(38వ నిమిషం), క్లిటన్ సిల్వా (79వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఒడిశా తరఫున స్టీవెన్ టేలర్(71వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు.
కాగా ఈ మ్యాచ్‌లో తన గోల్‌తో ఐఎస్‌ఎల్‌లో 50 గోల్స్‌లో భాగస్వామి అయిన భారత తొలి ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి రికార్డు సృష్టించాడు. ఇందులో అతను 42 గోల్స్ సాధించగా.. మరో ఎనిమిది గోల్స్‌కు సహకారం అందించాడు. ఓవరాల్‌గా లీగ్ ఆరు మ్యాచ్‌లాడిన బెంగళూరు మూడు విజయాలు, మూడు డ్రాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ ప్రారంభంలో ఫస్ట్ 35 నిమిషాల వరకు బాల్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో గోల్ చేసే అవకాశం రాలేదు. కానీ మూడు నిమిషాల తర్వాత బెంగళూరు ఎదురు దాడి మొదలుపెట్టడంతో సునీల్ చెత్రీ గోల్ చేశాడు. దాంతో బెంగళూరు ఆధిక్యంలో నిలిచింది. తర్వాత ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో ఫస్ట్ హాఫ్ 1-1తో ముగిసింది. సెకండ్ హాఫ్‌లో మరింత చెలరేగిన బెంగళూరు వరుస దాడులతో ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకుపోయింది.
పదే పదే ఒడిశా గోల్ పోస్ట్‌లోకి బంతిని కొట్టే ప్రయత్నం చేసింది. ఒడిశా కూడా ఎదురు దాడి దిగడంతో గోల్స్ నమోదు కాలేదు. కానీ 71వ నిమిషంలో సహచర ఆటగాడు అందించిన పాస్‌ను స్టీవెన్ టేలర్ గోల్‌గా మలిచి స్కోర్లను 1-1తో సమం చేశాడు. అయితే ఈ ఆనందరం ఒడిశా శిభిరంలో ఎంతో సేపు నిలవలేదు. మరో 8 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు ప్లేయర్ క్లిటన్ సిల్వా సూపర్ గోల్‌తో 2-1 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత స్కోర్ సమం చేసేందుకు ఒడిశా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు