గోవా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో డ్రాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ కూడా ఫలితం తేలకుండానే ముగిసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని నార్త్ఈస్ట్.. లీగ్‌లో బోణీ కొట్టాలని బరిలోకి దిగిన గోవాకు నిరాశే ఎదురైంది. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా ముగిసింది. దాంతో ఇరు జట్లూ చెరో పాయింట్‌తో సరిపెట్టాయి. మూడు మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో నార్త్ఈస్ట్ సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. ఈ సీజన్లో ఇంకా విజయాల ఖాతా తెరవని గోవా(2) ఏడో ప్లేస్‌లో ఉంది.
ఆట 40వ నిమిషంలో నార్త్ఈస్ట్కు లభించిన పెనాల్టీ కిక్‌ను ఆ జట్టు స్టార్ స్ట్రయికర్ ఇడ్రిశా సిల్లా గోల్‌గా మలిచి ఆధిక్యంలో నిలిపాడు. సరిగ్గా మరో రెండో నిమిషాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా గోవా స్ట్రయికర్ ఇగోర్ అంగులో(43వ నిమిషం) గోల్ చేసి 1-1తో స్కోరును సమం చేశాడు. ఆట మొదలైన ఐదో నిమిషంలోనే గోవా ప్లేయర్ మెండోజా షాట్ కొట్టగా.. ప్రత్యర్థి కీపర్ సుభాశిష్ చౌదరి అడ్డుకున్నాడు. ఫస్ట్ క్వార్టర్లో బంతిని 70 శాతం తమ ఆధీనంలో ఉంచుకున్న ఆ టీమ్ ప్లేయర్లు నార్త్ఈస్ట్ డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ సరైన పాసింగ్ లేకపోవడం వారిని దెబ్బతీసింది.
మరోవైపు ఎక్కువగా కౌంటర్‌పైనే దృష్టి పెట్టిన నార్త్ఈస్ట్ 30వ నిమిషంలో గోల్ కొట్టినంత పని చేసింది. బ్రిట్టో నుంచి వచ్చిన పాస్‌కు సిల్లా కొట్టిన హెడ్డర్ బార్‌పై నుంచి వెళ్లింది. అయితే 39వ నిమిషంలో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న అతను గోల్ కొట్టి నార్త్ఈస్ట్ను 1-0తో లీడ్‌లో నిలిపాడు. అయితే మూడు నిమిషాల తర్వాత లెప్ట్ ఫ్లాంక్ నుంచి ఫెర్నాండెస్ ఇచ్చిన క్రాస్‌ను బాక్స్‌లో అందుకున్న అంగులో బాల్‌ను నెట్లోకి కొట్టి స్కోరు సమం చేశాడు.
సెకండాఫ్‌లోనూ గోవా దూకుడుగా ఆడింది. అయితే, ఆంగులో, మెండోజా పలు అవకాశాలను మిస్ చేయడంతో ఇంకో గోల్ కొట్టలేకపోయింది. మరో ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. అల్బర్టో నొగ్వేరా కొట్టిన షాట్ గోల్ బార్‌కు తగిలి బయటకు వెళ్లడంతో గోవా విజయం చేజారింది.