
బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ జట్టు.. బెంగళూరు ఎఫ్‌సీని నిలువరించింది. దాంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్ 2-2తో ఫలితం తేలకుండా ముగిసింది. బెంగళూరు తరఫున జువానన్(13వ నిమిషం), ఉదాంత సింగ్(70వ నిమిషం) గోల్స్ చేయగా.. మకాడో(4, 78వ నిమిషం) నార్త్ ఈస్ట్‌కు రెండు గోల్స్ అందించాడు. నాలుగో నిమిషంలోనే నార్త్ ఈస్ట్ గోల్ చేసే అవకాశాన్ని సృష్టించుకుంది. గ్రౌండ్‌లో చురుకుగా కదిలిన మకాడో.. సుహెర్ అందించిన ఏరియల్ బాల్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపి 1-0 లీడ్ అందించాడు.
9 నిమిషాల తర్వాత రాహుల్ బేక్స్ ఇచ్చిన లాంగ్ పాస్‌ను జువానన్ ప్రత్యర్థి గోలీని తప్పిస్తూ పోస్ట్‌లోకి పంపడంతో బెంగళూరు స్కోరు సమం చేసింది. సెకండ్ హాఫ్‌లో ఇరు జట్లు మరింత పకడ్బందిగా ఆడాయి. అయితే 70వ నిమిషంలో వచ్చిన ఫ్రీ కిక్ పాస్‌ను ఎలాంటి తప్పిదం చేయకుండా ఉదాంత హెడర్‌గా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. కానీ ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. కాసేపటికే బెంగళూరు డిఫెన్సివ్ తప్పిదాన్ని ఆసరాగా చేసుకున్న మకాడ రెండో గోల్ చేసి జట్టుకు ఓటమి తప్పించాడు.