
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ రెండో ఓటమిని చవిచూసింది. తమ చివరి మ్యాచ్‌లో ముంబై సిటీ చేతిలో కంగుతిన్న హైదరాబాద్‌కు ఈ సారి కేరళ బ్లాస్టర్స్ షాకిచ్చింది. ఆదివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 0-2 తేడాతో కేరళ బ్లాస్టర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో కేరళ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అబ్దుల్ హక్కు (29వ నిమిషం), జొర్డాన్ ముర్రే(88వ నిమిషం) కేరళకు గోల్స్ అందించారు. మ్యాచ్‌ను దాటిగా ఆరంభించిన కేరళ మూడో నిమిషంలోనే గోల్‌కు ట్రై చేసింది. అయితే హైదరాబాద్ డిఫెండర్లు చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కానీ 29వ నిమిషంలో ఓ హెడర్‌తో అబ్దుల్.. కేరళ ఖాతా తెరిచాడు. హైదరాబాద్ చేసిన గోల్ ప్రయత్నాలు విఫలమవ్వగా.. కేరళ 1-0 లీడ్‌తో ఫస్టాఫ్‌ను ముగించింది. సెకండాఫ్‌లోనూ కేరళ జోరు కొనసాగింది. మరోపక్క స్కోర్ సమం చేసేందుకు హైదరాబాద్ టీమ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. చివర్లో జోర్డాన్ ముర్రే మరో గోల్ చేసి కేరళ లీడ్‌ను 2-0ను మరింత పెంచేశాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా కేరళ చేతిలోకి వెళ్లిపోయింది.