
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు మరో డ్రా ఎదురైంది. డబుల్ హెడర్‌లో భాగంగా ఆదివారం రాత్రి తిలక్ మైదాన్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో ఫలితం తేలలేదు. ఫెడ్రిగో గలేగోకు డీహెచ్‌ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, లాలెంగ్మావియాకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఎఫ్‌సీ 5 విజయాలు, 8 డ్రాలతో మూడో స్థానంలో కొనసాగుతుంది. అన్నే విజయాలు, డ్రాలు నమోదు చేసిన నార్త్ ఈస్ట్ యునైటెడ్ నాలుగో స్థానంలో ఉంది. గోల్స్ సంఖ్యం ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ ఒక్క స్థానం ముందుంది.
అంతకుముందు ఫర్టోడా మైదానంలో సాయంత్రం జరిగిన తొలి మ్యాచ్‌లో ఈస్ట్‌బెంగాల్ జట్టు 2-1 తేడాతో జంషేడ్‌పూర్‌ను ఓడించింది. బెంగాల్ ఆటగాళ్లు విల్లే మత్తి స్టెయిన్(6వ నిమిషంల), ఆంటోని పిల్కింగ్టన్(68వ నిమిషం) చెరో గోల్ చేశారు. జంషెడ్‌పూర్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను పీటర్ హార్ట్‌లీ(83వ నిమిషం) అందించాడు. నారాయణ్ దాస్‌కు డీహెచ్‌ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, స్టెయిన్‌మన్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్లకు ఇది 16వ మ్యాచ్ కాగా.. 4 విజయాలతో జంషెడ్ పూర్ ఏడో స్థానంలో, 3 విజయాలతో ఈస్ట్ బెంగాల్ 9వ స్థానంలో కొనసాగుతున్నాయి.