అమెరికా గడ్డపై ఇరాన్ ఆటగాళ్ల వినూత్న నిరసన.. ఆ నెంబర్ వెనుక గుండెకోత!
అగ్రరాజ్యం అమెరికా తమ దేశంపై జరుపుతున్న దాడులకు నిరసనగా ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ప్రత్యేకమైన పిన్ బ్యాడ్జ్ ధరించారు. ఫిఫా ప్రపంచకప్ 2026 కోసం అనేక ఆంక్షల మధ్య అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్.. మెక్సికోలోని టిజువానా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయంలో '#168' అనే నెంబర్ బ్యాడ్జ్‌లను ధరించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ ఘర్షణల తొలి రోజున.. ఒక ఎలిమెంటరీ పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ అమాయక పిల్లల స్మారకార్థం ఈ నంబర్‌ను వారు ధరించారు. 40 గంటల సుదీర్ఘ బస్సు ప్రయాణం, యూఎస్ వీసా ఇబ్బందులను దాటుకుని మెక్సికో చేరుకున్న ఇరాన్ జట్టు.. తమ దేశంలోని విషాదాన్ని ఇలా ప్రపంచం ముందు పెట్టింది.

ఇరాన్ ఆటగాళ్లు ఇలా అంతర్జాతీయ వేదికలపై తమ భావోద్వేగాలను చాటుకోవడం ఇదే తొలిసారి కాదు. మార్చిలో నైజీరియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఆటగాళ్లు పాఠశాల బ్యాగులను చేతబూని నిరసన తెలిపారు. కోస్టారికాతో మ్యాచ్‌కు ముందు బాంబు దాడుల్లో మరణించిన పౌరుల, చిన్నారుల చిత్రాలను, ధ్వంసమైన వారసత్వ కట్టడాల ఫోటోలను ప్రదర్శించారు. టర్కీ నుంచి బయలుదేరినప్పుడు లేని ఈ పిన్ బ్యాడ్జ్‌లను, మెక్సికో చేరుకునే లోపు ఆటగాళ్లు తమ జెర్సీలపై ధరించడం విశేషం.
వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో వీటిని ధరించవచ్చా?
మైదానంలోకి దిగాక క్రీడాకారులు లేదా అధికారులు ఈ బ్యాడ్జ్‌లను ధరిస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమఖ్య (FIFA) నుంచి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫిఫా నిబంధనల ప్రకారం.. క్రీడాకారుల దుస్తులు లేదా కిట్‌లపై ఎలాంటి రాజకీయ, మతపరమైన లేదా వ్యక్తిగత నినాదాలు, ప్రకటనలు, చిత్రాలు ఉండకూడదు. ఈ నియమం హెడ్ కోచ్‌తో సహా టెక్నికల్ ఏరియాలో ఉండే అధికారులందరికీ వర్తిస్తుంది. మరణించిన లేదా జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన, లేదా ఏదైనా రాజకీయ సంఘటనకు ప్రతిబింబించేలా ఉండే వేటినీ ఫిఫా అనుమతించదు.
అయితే, ప్రయాణ సమయాల్లో వీటిని ధరించడంపై స్పష్టమైన నిబంధనలు లేవు. గతంలో కోస్టారికాతో మ్యాచ్‌లో ఇరాన్ నిరసన తెలిపినప్పుడు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో స్వయంగా అక్కడే ఉన్నారు. అప్పట్లో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఫిఫా ప్రకటించినప్పటికీ, ఎలాంటి అధికారిక చర్యలు చేపట్టలేదు. మెక్సికో రాకముందు టర్కీలో జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇరాన్ ఆటగాళ్లు జాతీయ గీతం సమయంలో తమ చేతులను గుండెలపై ఉంచి నిరసన తెలిపారు. కానీ, ప్రపంచకప్ అనేది అతిపెద్ద వేదిక కాబట్టి, ఇరాన్ ఆటగాళ్లు తమ నిరసనలను ఎలా వ్యక్తపరుస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications