ప్రతిష్టాత్మక ఇంటర్‌కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్ టోర్నీని భారత్ డ్రాతో ప్రారంభించింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత ఫుట్‌బాల్ టీమ్ తొలి మ్యాచ్‌లో మారిషస్‌తో తలపడింది. మంగళవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 0-0తో డ్రా చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి.
ఈ మ్యాచ్‌తోనే మనోలో మార్క్వేజ్ భారత ఫుట్‌బాల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగా.. అతని శకం డ్రాతో మొదలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాయి. డిఫెన్స్ విభాగం పటిష్టంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం సాధ్యం కాలేదు.

ఫస్టాఫ్‌లో బంతిపై ఆధిపత్యం చెలాయించిన భారత్.. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసే ప్రయత్నం చేయగా మారిషన్ డిఫెన్స్ విభాగం సమర్థవంతంగా తిప్పికొట్టింది. సెకండాఫ్‌లో మారిషస్ బంతిపై ఆధిపత్యం చెలాయించగా.. భారత్ అడ్డుకుంది.
ఇక, శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లో సిరియా-మారిషస్, 9వ తేదీన జరిగే ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో భారత్-సిరియా తలపడనున్నాయి. భారత్ కంటే సిరియాది మెరుగైన ర్యాంక్. ప్రస్తుతం భారత ర్యాంక్ 124 కాగా.. సిరియాది 93.
ఇక 2018లో జరిగిన తొలి టోర్నీతో పాటు గతేడాది కూడా భారత్ విజేతగా నిలిచింది. ముచ్చటగా మూడోసారి టైటిల్‌పై కన్నేసింది. ఈ మెగా టోర్నీ కోసం ఫిఫా ప్రమాణాలకు తగినట్లుగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(సాట్) రూ. 15 కోట్లు ఖర్చు చేశాయి. ప్లేయర్లు, అధికారుల డ్రెస్సింగ్ రూమ్స్‌ను మార్చడంతో పాటు కొత్త ఫ్లడ్‌లైట్స్, 18 వేల బకెట్ సీట్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నీని ప్రారంభించారు. హైదరాబాద్‌ను దేశ క్రీడా రాజధానిగా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్మాణాత్మకంగా, ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు.
హైదరాబాద్‌లో ఈ ఇంటర్క కాంటినెంటల్ కప్ నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశమిచ్చినందుకు ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫుట్‌బాల్‌తో పాటు భవిష్యత్‌లో ఇతర క్రీడలకు సంబంధించిన మరిన్ని అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.