ఇంటర్‌కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్ టోర్నీ టైటిల్‌ను సిరియా సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా మూడు దేశాల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగిన ఈ టోర్నీలో వరుస విజయాలతో సిరియా విజేతగా నిలిచింది.
సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 0-3తో సిరియా చేతిలో చిత్తయ్యింది. తమ తొలి మ్యాచ్‌లో సిరియా 2-0తో మారిషన్‌ను ఓడించింది. దాంతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకోగా.. భారత్ మూడో స్థానానికి పరిమితమైంది.

సిరియాతో మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. మ్యాచ్ ఆరంభంలోనే గోల్ సమర్పించుకుంది. ఏడో నిమిషంలో మహమౌద్ అల్ అస్వాద్ గోల్ కొట్టి సిరియాకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత భారత్‌కు లభించిన పలు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఇరు జట్లు ఘోట్స్ కోసం హోరా హోరీగా తలపడ్డాయి. బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న సిరియా.. భారత డిఫెన్స్‌కు పరీక్షగా నిలిచింది. ఫస్టాఫ్ ముగిసే సరికి సిరియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో కూడా ఇరు జట్లు పోటా పోటీగా తలపడ్డాయి. 76వ నిమిషంలో సిరియా మరో గోల్ నమోదు చేసి ఆధిక్యాన్ని డబుల్ చేయగా.. ఎక్స్‌ట్రా టైమ్‌లో మరో గోల్ నమోదు చేసిన సిరియా విజయంతో పాటు టైటిల్ కైవసం చేసుకుంది.
ఇక 2018లో జరిగిన తొలి టోర్నీతో పాటు గతేడాది కూడా భారత్ విజేతగా నిలిచింది. కానీ ఈ సారి ఆ జోరు కొనసాగించలేకపోయింది. ఈ మెగా టోర్నీ కోసం ఫిఫా ప్రమాణాలకు తగినట్లుగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(సాట్) రూ. 15 కోట్లు ఖర్చు చేశాయి.
ప్లేయర్లు, అధికారుల డ్రెస్సింగ్ రూమ్స్‌ను మార్చడంతో పాటు కొత్త ఫ్లడ్‌లైట్స్, 18 వేల బకెట్ సీట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నీని ప్రారంభించడం గమనార్హం.