నా పని అయిపోలేదు..ఐ యామ్ బ్యాక్: రొనాల్డో భావోద్వేగం
తన పని ముగియలేదని, ఐయామ్ బ్యాక్ అంటూ ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో గర్జించాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా బుధవారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్-కే మ్యాచ్‌లో పోర్చుగల్ 5-0 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్‌తో మెరిసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో పోర్చుగల్ డ్రా చేసుకోవడంతో రొనాల్డోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రొనాల్డో జట్టుకు భారంగా మారాడని, అతని పనైపోయిందని పలువురు మాజీ ఆటగాళ్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ రొనాల్డో తన అద్వితీయమైన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడు.

ఈ విజయానంతరం మాట్లాడిన రొనాల్డో.. విమర్శకుల మాటలను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 'ఐ యామ్ బ్యాక్.. నా పని అయిపోలేదు. గత వారం మాకు చాలా కష్టంగా గడిచింది. అభిమానులు, విమర్శకులు మాపై, ముఖ్యంగా మా కోచ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
నేను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లోకి వచ్చి 23 ఏళ్లు దాటింది. నేను సరిగ్గా ఆడకపోతే చాలు.. 'రొనాల్డో కథ ముగిసింది, అతనికి ముసలితనం వచ్చింది' అని విమర్శిస్తారు. కానీ ఈ రోజు మ్యాచ్‌తో నేనూ, నా జట్టు సభ్యులం విమర్శకులకు సరైన సమాధానం చెప్పాం'అని రొనాల్డో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రొనాల్డో ఆడిన గత 10 ప్రధాన టోర్నీ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేదు. 33 షాట్లు కొట్టినా గోల్ లభించకపోవడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
రికార్డుల రారాజు..
ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన రొనాల్డో.. 6 వేర్వేరు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌ల్లో మొత్తం 10 గోల్స్‌తో పోర్చుగల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన యుసేబియో (9 గోల్స్) రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా, యూరో,వరల్డ్ కప్‌ల్లో గోల్ చేసిన అత్యంత వృద్ధ యూరోపియన్ ఆటగాడిగా (41 ఏళ్ల 138 రోజులు) నిలిచాడు.
మెస్సీ-రొనాల్డోల పోటీనే వారి బలం..
పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెజ్ మాట్లాడుతూ.. రొనాల్డో, మెస్సీల మధ్య ఉన్న పోటీనే వారిని నిరంతరం అత్యుత్తమంగా ఉంచేలా నడిపిస్తుందని అన్నాడు. రొనాల్డో జట్టుకు ఐకాన్ ప్లేయర్ అని కొనియాడాడు.
ఈ ఓటమికి బాధ్యత నాదే..
మరోవైపు తొలిసారి ప్రపంచకప్ ఆడుతూ.. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఐదో ఆసియా దేశంగా ఉజ్బెకిస్తాన్ నిలిచింది. ఈ భారీ ఓటమిపై ఆ జట్టు కోచ్ ఫాబియో కానవారో మాట్లాడుతూ.. 'మా ఆటగాళ్లు సాయశక్తులా ప్రయత్నించారు. ఈ 5-0 ఓటమికి కోచ్‌గా నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఆటగాళ్ల తప్పు లేదు'అని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

