FIFA World Cup 2026: స్పెయిన్‌దే విజయం.. వారి వ్యూహం ముందు అర్జెంటీనా జుజుబీ !
ఫిఫా ప్రపంచకప్ 2026 తుది దశకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్ స్పెయిన్ టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఇరు జట్లు ఓటమెరుగకుండా అజేయంగా ఫైనల్ చేరాయి. ఇప్పుడు ఈ రెండు జట్లలో విజయం ఎవర్నీ వరిస్తుందో? అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈసారి స్పెయిన్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫుట్‌బాల్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి ఆ జట్టు ఆటతీరు అలా ఉందని, వారి వ్యూహం ముందు అర్జెంటీనా కూడా జుజుబీనేనని కామెంట్ చేస్తున్నారు.
ప్రత్యర్థుల ఆలోచనతో ఆట..
విశ్లేషకుల జోస్యాలను పక్కనపెడితే స్పెయిన్ ఆటను నిశితంగా పరిశీలిస్తే ఆ జట్టును ఓడించడం అర్జెంటీనాకు కత్తిమీద సామే అనే విషయం అర్థమవుతుంది. చాలామందికి స్పెయిన్ అంటే "టికీ-టాకా" వ్యూహం మాత్రమే గుర్తొస్తుంది. కానీ టికీ-టాకా అంటే కేవలం చిన్న చిన్న పాస్‌లు ఇవ్వడం కాదు. ఈ వ్యూహం అసలు ఉద్దేశం ప్రత్యర్థికి బంతే ఇవ్వకుండా.. మ్యాచ్ వేగాన్ని తమ చేతుల్లో తీసుకోవడం. బంతి తమ దగ్గర ఉంటే ప్రత్యర్థి గోల్ చేయలేడు... ఇదే ఆ వ్యూహం వెనుక ఉన్న అసలు ఆలోచన.

2010 ప్రపంచకప్‌లో స్పెయిన్ ఇదే తత్వంతో విజేతగా నిలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ టోర్నమెంట్‌లో స్పెయిన్ ఏ మ్యాచ్‌లోనూ నాలుగు లేదా ఐదు గోల్స్ కొట్టలేదు. కానీ ఒక్కో గోల్‌తోనే మ్యాచ్‌లను గెలిచింది. నాకౌట్ దశలో పోర్చుగల్‌పై 1-0, పరాగ్వేపై 1-0, జర్మనీపై 1-0, ఫైనల్లో నెదర్లాండ్స్‌పై అదనపు సమయంలో 1-0తో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
ఒక గోల్ చేస్తే చాలు అనే మైండ్ సెట్‌తో..
ఆ జట్టు నమ్మకం ఒక్కటే... 'ఒక గోల్ చేస్తే చాలు... ప్రత్యర్థికి ఇంకో గోల్ చేసే అవకాశం ఇవ్వొద్దు.' అదే వ్యూహం ప్రపంచకప్‌ను అందించింది. తాజా ఫిఫా ప్రపంచకప్ 2026లోనూ స్పెయిన్ ఆటను చూస్తుంటే.. ఆ పాత తత్వం కొత్త రూపంలో కనిపిస్తోంది . ఒకప్పుడు బంతిని ఎక్కువసేపు తమ దగ్గర ఉంచి ప్రత్యర్థిని అలసిపోయేలా చేసేవారు.
ఇప్పుడు దానికి తోడు అత్యంత క్రమశిక్షణతో కూడిన డిఫెన్స్‌ను జోడించారు. అందుకే బంతి తమ దగ్గర లేకపోయినా మ్యాచ్‌పై నియంత్రణ మాత్రం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం స్పెయిన్ కోచింగ్ బృందం ప్రత్యర్థి జట్ల గత మ్యాచ్‌లను పదేపదే విశ్లేషిస్తుందని, ప్రతి ఆటగాడి అలవాట్లను గమనించి, ఒత్తిడిలో ఎలా ఆడతాడో ముందుగానే అధ్యయనం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ముందే పసిగడుతున్న డిఫెండర్లు..
అందుకే కొన్నిసార్లు స్పెయిన్ డిఫెండర్లు బంతి ఎక్కడికి వెళ్లబోతోందో ముందే తెలిసినట్టుగా సరైన చోట కనిపిస్తున్నారు. అంతేకాకుండా స్పెయిన్ వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా అజేయంగా నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రియాను 3-0తో, పోర్చుగల్‌ను 1-0తో, బెల్జియంను 2-1తో, ఫ్రాన్స్‌ను 2-0తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ప్రత్యర్థి జట్లు గోల్ చేయకుండా నిలవరించింది.
చరిత్ర కూడా స్పెయిన్‌కు అండగా నిలుస్తోంది. 1964, 2008, 2012, 2024 యూరో కప్‌లు, 2010 ప్రపంచకప్... ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. స్పెయిన్ గొప్పతనం కేవలం స్టార్ ఆటగాళ్లలో మాత్రమే లేదు. మొత్తం జట్టు ఒకే ఆలోచనతో.. ఒకే వ్యూహంతో కదలడంలో ఉంది. అందుకే 2008 యూరో, 2010 ప్రపంచకప్, 2012 యూరోలను వరుసగా గెలిచి ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించింది.
ఇప్పుడు మిగిలింది ఒకే అడుగు. మరోసారి ప్రపంచకప్‌ను గెలిచి 2010 తర్వాత మళ్లీ చరిత్ర సృష్టిస్తుందా? లేక ఈసారి ప్రత్యర్థి జట్టు స్పెయిన్ క్రమశిక్షణకు, డిఫెన్స్‌కు విరుగుడు కనిపెడుతుందా? అనేది ఫైనల్లో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది... స్పెయిన్ కేవలం ఫుట్‌బాల్ ఆడటం లేదు, ప్రత్యర్థి ఆలోచించే విధానాన్నే మార్చే ఆట ఆడుతోంది. బెస్టాఫ్ లక్ స్పెయిన్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

