
హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచి సాకర్ అభిమానుల మనసులు గెలిచిన క్రొయేషియా జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. వరల్డ్ కప్ అనంతరం స్వదేశానికి చేరుకున్న క్రొయేషియా ఆటగాళ్లకు ఊహించని రీతిలో దేశ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్) అందుకున్న లుకా మోడ్రిచ్‌తో కరచాలనం చేసేందుకు క్రొయేషియా ప్రజలు పోటీపడ్డారు. దేశ రాజధాని జాగ్రిబ్ నగరంలో ఓపెన్ టాప్ బస్సులో వచ్చిన ఆటగాళ్లకు కరతాళ ధ్వనులతో, ప్లేయర్ల పేర్ల నినాదాలతో గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.
రష్యా నుంచి నేరుగా రాజధానికి చేరుకున్న ఆటగాళ్లను అక్కడి ప్రభుత్వం ఓపెన్ టాప్ బస్సులో ఊరేగించింది. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో క్రొయేషియా వాసులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రొయేషియాకు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించడానికి కారణం ఉంది. సరిగ్గా 50 లక్షల జనాభా కూడా లేని క్రొయేషియా వరల్డ్ కప్ టోర్నీలో హేమాహేమీ జట్లను ఓడించి ఫైనల్‌కు చేరింది. గత ఆదివారం మాస్కాలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో 4-2తేడాతో ఓటమిపాలైంది.
ఫైనల్లో పటిష్ట ఫ్రాన్స్ జట్టుతో చివరివరకూ పోరాడిన క్రొయేషియా ఆటగాళ్లు ఇప్పుడు దేశంలో సూపర్ స్టార్లు అయ్యారు. ఇప్పుడు క్రొయేషియాలో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ఆటగాళ్ల ఘనత గురించే మాట్లాడుకుంటున్నారు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్ చేరిన జట్లలో క్రొయేషియా (20)దే పెద్ద ర్యాంకు కావడం విశేషం.
1998 వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ 18వ ర్యాంకుతో బరిలో దిగి టైటిల్ నెగ్గడం విశేషం. రష్యా వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఒకవేళ ప్రాన్స్ నెగ్గి ఉంటే అత్యధిక ర్యాంకుతో బరిలోకి కప్ సాధించిన జట్టుగా నిలిచి ఫ్రాన్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేదే. ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేషియా జట్టు ఆద్యంతం తన ప్రదర్శనతో సాకర్ అభిమానులను ఆకట్టుకుంది.