మెస్సీ లేడు.. గిస్సీ లేడు.. స్పెయిన్‌దే ఫుట్‌బాల్ ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో స్పెయిన్ విజేతగా నిలిచింది. సోమవారం అర్ధరాత్రి ఉత్కంఠగా సాగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ నిర్ణీత సమయంలో ఫలితం తేలలేదు. దాంతో ఎక్స్‌ట్రా టైమ్ ఆడించాల్సి వచ్చింది. ఈ సమయాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది.
106వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ ఫెర్రాన్ టొర్రెస్ అద్వితీయమైన గోల్‌తో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ రెండో ప్రపంచకప్‌ను ముద్దాడింది. 2010లో తొలి ప్రపంచకప్‌ను గెలుచుకున్న స్పెయిన్.. 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది.

రూ.481 కోట్ల ప్రైజ్‌మనీ..
గత టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగిన స్పెయిన్.. ఈ సారి మాత్రం పక్కా ప్రణాళికలతో సమష్టిగా రాణించింది. 2023 నేషన్స్ లీగ్, 2024 యూరో కప్ గెలిచిన స్పెయిన్.. తాజాగా విశ్వకిరీటాన్ని సొంతం చేసుకుంది.
ప్రపంచకప్ విజేతగా నిలిచిన స్పెయిన్‌కు రూ. 481 కోట్ల ప్రైజ్‌మనీ వరించింది. రన్నరప్ అర్జెంటీనాకు రూ.317 కోట్లు దక్కాయి. ఈ ప్రపంచకప్ విజయంతో సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలని భావించిన అర్జెంటీనా కెప్టెన్, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ చిరకాల స్వప్నానికి తెరపడింది.
టికి టాకా వ్యూహాం
స్పెయిన్ టికి టాకా వ్యూహం ముందు అర్జెంటీనా తేలిపోయింది. ఫైనల్లో పూర్తిగా స్పెయిన్ ఆధిపత్యం కనబర్చింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న స్పెయిన్.. అర్జెంటీనా గోల్ పోస్ట్‌పై పదే పదే దాడి చేసింది. కానీ ఆ జట్టు గోల్ కీపర్ మార్టినెజ్.. అడ్డుగోడలా నిలిచాడు. లేకుంటే అర్జెంటీనా ఘోర పరాజయాన్ని మూటగట్టుకునేది. ఎంతలా స్పెయిన్ ఆధిపత్యం సాగిందంటే.. ఆటలో 68 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంది. అంతేకాకుండా అర్జెంటీనా గోల్ పోస్ట్‌పై 11 సార్లు దాడి చేసింది.
తమ టికీ టాకా వ్యూహంతో చిన్న చిన్న పాస్‌లు ఇచ్చుకుంటూ ఆటను వేగంగా నడిచేలా చూసుకుంది. ప్రత్యర్థి ప్రణాళికలను ముందే పసిగడుతూ చెలరేగింది. అర్జెంటీనా ప్లేయర్ ఫెర్నాండో 90+3 నిమిషంలో రెడ్ కార్డుతో బయటకు వెళ్లి పోవడం ఆ జట్టు కొంపముంచింది. దాంతో అర్జెంటీనా 10 మంది ప్లేయర్లతోనే మిగతా ఆటను కొనసాగించాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది.
చరిత్ర సృష్టించిన స్పెయిన్..
ఈ విజయంతో ఏకకాలంలో పురుషుల, మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లు గెలుచుకున్న తొలి దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. 2023లో స్పెయిన్ మహిళల టీమ్ విశ్వ విజేతగా నిలిచింది. తదుపరి మహిళల ప్రపంచకప్ 2027లో జరగనుంది. అప్పటి వరకు స్పెయిన్ మహిళల టీమ్ వరల్డ్ ఛాంపియన్‌గా కొనసాగనుంది.
ఫైనల్లో గోల్ కొట్టి స్పెయిన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫెర్రాన్ టొర్రెస్‌కు.. సుపీరియర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డ్‌ను రోడ్రి గెలుచుకున్నాడు. 19 ఏళ్ల పావ్ క్యూబార్సీ టోర్నీ యంగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. గోల్ కీపర్ ఉనై సైమన్‌కు గోల్డెన్ గ్లోవ్ అవార్డు దక్కింది. అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డును కిలియన్ ఎంబాపే అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

