Fifa World Cup 2026: అర్జెంటీనా చరిత్ర సృష్టిస్తుందా? మెస్సీ టీమ్ బలాలు, బలహీనతలు!
ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీకి రంగం సిద్దమైంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ నేపథ్యంలో ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సి పైనే ఉన్నాయి. తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న 38 ఏళ్ల మెస్సికి బహుశా ఇదే చివరి మెగా టోర్నీ కావచ్చు.
గత ప్రపంచకప్ 2022లో ఫ్రాన్స్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా.. ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ ఈ కప్ గెలిస్తే.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే రెండుసార్లు విజేతగా నిలిచిన ఏకైక కెప్టెన్‌గా మెస్సి నిలుస్తాడు. అయితే గత 64 ఏళ్లలో ఏ జట్టు కూడా వరుసగా రెండోసారి టైటిల్ డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా బలాబలాలపై ఓ లుక్కెద్దాం.

బలాలు :
కోచ్ లియోనెల్ స్కలోని నేతృత్వంలో అర్జెంటీనా ప్రస్తుతం తిరుగులేని జట్టుగా ఉంది. గతంలో వరుసగా 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లతో పాటు 2022 ప్రపంచకప్ గెలిచిన అనుభవం ఈ జట్టు సొంతం. ముఖ్యంగా ఎంజో ఫెర్నాండెజ్, అలెక్సిస్ మెక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్‌లతో కూడిన మిడ్‌ఫీల్డ్ విభాగం టోర్నీలోనే అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
బలహీనతలు :
స్టార్ ప్లేయర్ ఏంజెల్ డి మారియా జట్టులో లేకపోవడం.. మెస్సి కెరీర్ చరమాంకానికి చేరడంతో జట్టు అటాకింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. జూలియన్ అల్వారెజ్, లౌటారో మార్టినెజ్ వంటి స్ట్రైకర్లు ఉన్నప్పటికీ, మెస్సి మైదానంలో లేకపోతే గోల్స్ చేసే ఆటగాడు ఎవరా? అనే ప్రశ్నార్థకంగా మారింది.
అవకాశాలు:
మెస్సి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే ప్రత్యర్థి జట్లకు ముప్పు తప్పదు. అయితే, మెస్సి లేకపోయినా మ్యాచ్‌లు గెలవగలమని అర్జెంటీనా గత 2024 కోపా అమెరికా ఫైనల్‌తో పాటు పలు క్వాలిఫైయర్ మ్యాచ్‌ల్లో నిరూపించింది. యువ ఆటగాళ్లకు ఇది ఒక సువర్ణావకాశం.
సవాళ్లు:
అర్జెంటీనా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ టోర్నీలో ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తవచ్చు. మెస్సితో సహా పలువురు ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల మేనేజ్‌మెంట్‌లో భాగంగా మైదానానికి దూరంగా శిక్షణ పొందుతున్నారు.
గ్రూప్ 'J' లో ఉన్న అర్జెంటీనా.. అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్ జట్లతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే జరగనున్నాయి.
అర్జెంటీనా జట్టు:
గోల్‌కీపర్లు: ఎమిలియానో మార్టినెజ్, గెరోనిమో రుల్లి, జువాన్ ముస్సో
డిఫెండర్లు: నహుయెల్ మోలినా, గొంజాల్లో మోంటియెల్, క్రిస్టియన్ రొమేరో, లియోనార్డో బలేర్డి, నికోలస్ ఒటామెండి, లిసాండ్రో మార్టినెజ్, నికోలస్ ట్యాగ్లియాఫికో, ఫ్యాకుండో మెదినా
మిడ్‌ఫీల్డర్లు: లియాండ్రో పరేడెస్, అలెక్సిస్ మెక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్, జియోవారీ లో సెల్సో, ఎక్సెక్విల్ పలాసియోస్, ఎంజో ఫెర్నాండెజ్, వాలెంటిన్ బార్కో
ఫార్వర్డ్స్: లియోనెల్ మెస్సి, జూలియన్ అల్వారెజ్, లౌటారో మార్టినెజ్, థియాగో అల్మాడా, నికోలస్ పాజ్, నికోలస్ గొంజాలెజ్, గియులియానో సిమియోన్, జోస్ మాన్యువల్ లోపెజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications