FIFA World Cup 2022: అప్పుడు భారత్‌కు అవకాశం వచ్చినా ఆడలేదు.. ఎందుకంటే?

హైదరాబాద్: యావత్ క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. ఖతర్ వేదికగా ఆదివారం అంగరంగ వైభవంగా ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే 32 జట్లు ఖతర్ చేరుకున్నాయి. నిర్వాహకులు సైతం ఆరంభవేడుకులకు ఏర్పాట్లు చేస్తున్నారు. యావత్ ప్రపంచం మెచ్చిన ఈ ఫుట్‌బాల్ ఆటలో భారత్ మాత్రం వెనుకబడే ఉంది. 130 కోట్ల జనాభా కలిగిన భారత్.. ఇప్పటి వరకు ఒక్క ఫుట్‌బాల్ ప్రపంచకప్ కూడా ఆడకపోవడం గమనార్హం. ఇది భారత క్రీడాభిమానులను నిరాశపరిచే విషయం. అయితే ఒకసారి భారత్‌కు ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడే అవకాశం వచ్చినా.. ఆడలేకపోయింది.

1950 బ్రెజిల్ ప్రపంచకప్‌లో..
72 ఏళ్ల క్రితం 1950లో బ్రెజిల్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌కు భారత ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించింది. కానీ అనివార్యాల కారణాల వల్ల ఆ టోర్నీలో పాల్గొనలేకపోయింది. క్వాలిఫైయింగ్ రౌండ్ విధానంలో జరిగిన 1950 బ్రెజిల్ ప్రపంచకప్ జరగగా.. గ్రూప్ 10లో ఉన్న భారత్ నేరుగా అర్హత సాధించింది. క్వాలిఫైయింగ్ గ్రూప్‌లో ఉన్న ఫిలిప్పీన్స్‌తో పాటు, బర్మా టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత్ ఒక్క మ్యాచ్ ఆడకుండానే మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యింది.

పూల్-3లో చోటు..
పూల్-3లో ఇటలీ, పరాగ్వేతో పాటు భారత్‌కు చోటు దక్కింది. అయితే ఈ టోర్నీ భారత్ ఆడి ఉంటే టైటిల్ గెలవకపోయినా.. మంచి ప్రదర్శన చేసేదని ఆ నాటి స్పోర్ట్స్ జర్నలిస్టులు పేర్కొన్నారు. అయితే ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొనకపోవడానికి స్పష్టమైన సమాచారం అయితే లేదు. జట్టు ఎంపికలో విభేదాలతో పాటు ప్రాక్టీస్‌కు సమయం లేదనే కారణాలతో చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది.

షూస్ లేవనే కారణంతో..
అంతేకాకుండా భారత ఆటగాళ్లకు షూస్ లేకపోవడంతో ఫిఫా అనుమతించలేదనే వాదన కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ వాదనలో నిజం లేదని ఆ నాటి జర్నలిస్ట్‌లు స్పష్టం చేస్తున్నారు. ఆ కాలంలో ఫుట్‌బాల్ ప్లేయర్లు తమ పాదాలకు మందపాటి పట్టీ కట్టుకుని ఆడటానికి ఇష్టపడేవారని, 1954 వరకు ఈ పద్దతి చాలా దేశాల్లో పాటించేవారని పేర్కొన్నారు. ఇక భారత జట్టు వద్ద తగినంత డబ్బు లేకపోవడంతో బరిలోకి దిగలేదనే ప్రచారం కూడా జరిగింది.

ఒలింపిక్స్ ఆడనివ్వరనే భయంతో...
డబ్బుల సమస్య ఉన్న మాట వాస్తవమే అయినా.. టోర్నీ ప్రారంభానికి ముందే ఈ సమస్య పరిష్కారమైందని సీనియర్ జర్నలిస్ట్‌లు చెప్పే మాట.
అయితే ఆ రోజుల్లో ప్రపంచకప్ ఆడే ఆటగాళ్లను ప్రొఫెషనల్ ప్లేయర్స్‌గా పరిగణించేవారు. వారిని ఒలింపిక్స్ వంటి టోర్నీలకు అనుమతించేవారు కాదని, ఆ భయంతోనే భారత జట్టు పాల్గొనలేదనేది మరో వాదన. ఏది ఏమైనప్పటికీ ప్రపంచం మెచ్చిన టోర్నీ భారత్‌కు ప్రాతినిథ్యం లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications