
హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్ 2022లో మరో సంచలన నమోదైంది. ఫుట్‌బాల్ ప్రపంచమే షాక్‌కు గురయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం కలిగిన జర్మనీ ప్రీక్వార్టర్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. సాకర్ సమరంలో నాలుగుసార్లు చాంపియన్స్‌గా నిలిచిన జర్మనీ.. అత్యధిక వరల్డ్‌కప్స్ సాధించిన జట్టుగా ఇటలీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. అలాంటి జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో ఫుట్‌బాల్ ప్రేమికులు అవాక్కవుతున్నారు. ఓడలు బళ్ళు అవ్వడం.. బళ్ళు ఓడలవ్వడం అంటే ఇదేనేమో అని కామెంట్ చేస్తున్నారు.
2014లో చివరి సారి ప్రపంచకప్ గెలిచిన జర్మనీ.. 1954,1974,1990లోనూ చాంపియన్‌గా నిలిచింది. 2014 నుంచి జర్మనీ గ్రూప్ స్టేజ్ దాటలేకపోయింది. 2018 ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలోనే వెనుదిరిగా ఆ జట్టు.. తాజాగా అదే వైఫల్యాన్ని కొనసాగించింది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేకున్నా.. సమష్టితత్వం లోపించింది. థామస్ ముల్లర్, మారియో గోట్జే, లుకాస్ క్లోస్టర్‌మెన్, జోనస్ హాప్‌మన్ వంటి స్టార్ ఆటగాళ్లున్నా.. వీరు జర్మనీని నాకౌట్‌కు చేర్చలేకపోయారు.
గురువారం అర్థరాత్రి కోస్టారికాపై 4-2 తేడాతో ఘన విజయం సాధించినప్పటికి జర్మనీ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అందుకు కారణం జర్మనీ తమ తొలి మ్యాచ్ జపాన్ చేతిలో ఓడడమే. ఆ తర్వాత బలమైన స్పెయిన్‌తో మ్యాచ్ డ్రా చేసుకోవడం ఆ జట్టును కొంపముంచింది. ఆ తర్వాత జపాన్.. స్పెయిన్‌ను ఓడించడంతో జర్మనీ కథ ముగిసింది.
ఓటమికి తోడు దురదృష్టం కూడా తోడవ్వడంతో జర్మనీ వరుగగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ నుంచి భారంగా వైదొలిగింది. గ్రూప్-ఈ నుంచి స్పెయిన్‌తో పాటు జపాన్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. 2014 ఫిఫా ప్రపంచకప్‌ను జర్మనీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బాస్టియన్ ష్వీన్‌స్టీగర్ , లుకాస్ పోడోల్స్కీలు రిటైర్ అవ్వడంతోనే జట్టు కళ తప్పిందని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. జర్మనీ జట్టు వైభవం కూడా వారితోనే పోయిందని అభిప్రాయపడుతున్నారు.