FIFA World Cup 2022 నాకౌట్‌కు ఇంగ్లండ్, అమెరికా.. నిష్క్రమించిన ఇరాన్, వేల్స్

దోహా: ఫిఫా ప్రపంచకప్ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ అంచనాలను నిలబెట్టుకుంటూ నాకౌట్‌ చేరింది. ఎలాంటి నాటకీయతకు తావులేకుండా.. ఉత్కంఠను దరి చేరనీయకుండా.. వేల్స్‌పై గెలిచి.. ఘనంగా అగ్రస్థానంతో ముందంజ వేసింది. మరోవైపు ఇరాన్‌ నుంచి పోటీ ఎదుర్కొని నిలబడ్డ అమెరికా.. గ్రూప్‌లో రెండో స్థానంతో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

టోర్నీ నుంచి ఇరాన్‌, వేల్స్‌ నిష్క్రమించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్‌-బి పోరులో ఇంగ్లండ్ 3-0 తేడాతో వేల్స్‌ను చిత్తుచేసింది. రెండు గోల్స్‌తో మార్కస్‌ రష్‌ఫోర్డ్‌ (50వ, 68వ నిమిషాల్లో) సత్తాచాటాడు. ఫిల్‌ ఫోడెన్‌ (51వ) ఓ గోల్‌ కొట్టాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీతో పెనాల్టీ షూటౌట్లో గోల్‌ చేయడంలో విఫలమై జాతి వివక్ష దూషణలకు గురైన రష్‌ఫోర్డ్‌.. ఇప్పుడు ఆ దేశానికి హీరోగా నిలిచాడు.

ఆట పదో నిమిషంలోనే గోల్‌ చేసేందుకు రష్‌ఫోర్డ్‌కు మంచి అవకాశం వచ్చింది. కానీ ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను అతను దాటలేకపోయాడు. 38వ నిమిషంలో ఫోడెన్‌ కిక్‌ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లిపోయింది. విరామం తర్వాత ఇంగ్లండ్‌ దాడులు ఉద్ధృతం చేసింది.ఈ క్రమంలోనే లభించిన ఫ్రీకిక్‌ సాయంతో పెనాల్టీ ప్రదేశం బయట నుంచి బంతిని నేరుగా గోల్‌పోస్టులోకి పంపించి రష్‌ఫోర్డ్‌ జట్టు ఖాతా తెరిచాడు.

ఆ వెంటనే కెప్టెన్‌ హ్యారీ కేన్‌ నుంచి బంతి అందుకున్న ఫోడెన్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌ రాబట్టాడు. గోల్‌ పోస్టు ముందు ఉన్న ఖాళీని ఉపయోగించుకుని కేన్‌ ఎడమ వైపు బంతిని పాస్‌ చేశాడు. అక్కడికి దూసుకొచ్చిన ఫోడెన్‌ దీన్ని లోపలికి పంపించాడు.

ప్రత్యర్థిని అందుకునేందుకు వేల్స్‌ కూడా గట్టిగానే ప్రయత్నించింది. కానీ గోల్‌పోస్టు ముందు అడ్డుగోడలా నిలబడ్డ ఇంగ్లండ్ గోల్ కీపర్ పిక్‌ఫోర్డ్‌ ముందు ఆ జట్టు ఆటలు సాగలేదు. అంతలోనే ఇద్దరు డిఫెండర్లను, గోల్‌కీపర్‌ను తప్పిస్తూ రష్‌ఫోర్డ్‌ చక్కటి గోల్‌ రాబట్టాడు. బంతి గోల్‌కీపర్‌ కాళ్ల మధ్య నుంచి లోపలికి వెళ్లింది. ఆ తర్వాత ఆధిక్యాన్ని ఇంగ్లండ్ నిలబెట్టుకుంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఇంగ్లాండ్‌ నిలిచింది. 64 ఏళ్ల తర్వాత తిరిగి ప్రపంచకప్‌లో ఆడిన వేల్స్‌ ఓ డ్రా, రెండు ఓటములతో ఆఖరి స్థానంతో నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో సెనెగల్‌తో ఇంగ్లండ్‌ తలపడుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS
Story first published: Thursday, December 1, 2022, 10:29 [IST]
Other articles published on Dec 1, 2022
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X