
హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం సోచీ నగరంలోని షిష్ట్ స్టేడియంలో పోర్చుగల్, స్పెయిన్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్లు చెరో మూడు గోల్స్ చేయడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, ఈ మ్యాచ్ పుట్ బాల్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు. స్పెయిన్‌పై పోర్చుగల్ కెప్టెన్ రోనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. సాకర్ సంరంభం ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ చూపించింది. ఆటలో భాగంగా స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి పోటాపోటీని ప్రదర్శించాయి.
అద్భుతమైన క్వాలిటీ గేమ్‌తో ప్లేయర్లు ఆకట్టుకున్నారు. హ్యాట్రిక్‌తో దుమ్మరేపిన రోనాల్డో .. ఓ రకంగా స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. ఆటలో భాగంగా నాలుగో నిమిషంలోనే క్రిస్టియానో రొనాల్డో తొలి గోల్ సాధించాడు. తొలి అర్ధభాగంలో పోర్చుగల్ దూకుడుగా కనిపించింది..
కానీ, ఆ తర్వాత స్పెయిన్ తన జోరును పెంచడంతో పాటు మిడ్‌ఫీల్డర్లు డేవిడ్ సెల్వా, ఆండ్రేస్ ఇనెస్టాలు అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. వరల్డ్ కప్‌కు ముందు స్పెయిన్ జట్టు నిలకడలేని ఆటను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాడు డీగో కోస్టా తన పర్ఫార్మెన్స్‌తో అందరికీ షాకిచ్చాడు.
ఈ మ్యాచ్‌లో స్పెయిన్ తరపున డీగో కోస్టా 24, 55వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక, స్పెయిన్ ఆటగాడు నాచో కూడా 58వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఇక, తొలి అర్ధభాగంలో రెండు గోల్స్ చేసిన రొనాల్డో... రెండో అర్ధభాగంలో చెలరేగాడు.
మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో రోనాల్డో చెలరేగిపోయాడు. వన్ మ్యాన్ షో అలరించాడు. 88వ నిమిషంలో ఫ్రీ కిక్‌తో రోనాల్డో గోల్ చేసి స్పెయిన్ మ్యాచ్ విజయావకాశాలపై ఆశలపై నీళ్లు చల్లాడు.