
హైదరాబాద్: నాకౌట్ స్టేజి తుది దశకు చేరేకొద్దీ రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఉత్కంఠగా మారుతున్నాయి. నాకౌట్‌లో చాలావరకు మ్యాచ్ ఫలితాలు పెనాల్టీ షూటౌట్‌లోనే వస్తున్నాయి. తాజాగా, నాకౌట్ పోరులో మరో మ్యాచ్‌లో కూడా పెనాల్టీ షూటౌట్ ద్వారానే ఫలితం వచ్చింది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి కొలంబియా-ఇంగ్లాండ్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-3తేడాతో కొలంబియాపై విజయం సాధించింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరు జట్లు ప్రత్యర్ధి గోల్ పోస్టులపై దాడులు చేశాయి. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
అయినా సరే, తొలి అర్ధభాగం ముగిసే వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. అనంతరం ప్రారంభమైన రెండో అర్ధభాగం 57వ నిమిషంలో హ్యారీ కేన్ పెనాల్టీ ద్వారా గోల్ సాధించి ఇంగ్లాండ్‌కు ఆధిక్యం ఇచ్చాడు. ఆ తర్వాత బంతిని ఎక్కువ సేపు కొలంబియా తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ గోల్ చేయడంలో విఫలమైంది.
దీంతో 90 నిమిషాల సమయం ముగిసే వరకు కొలంబియా గోల్ చేయలేదు. అయితే, అదనపు సమయంలో(90+3) గోల్ చేసి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత మరో 30 నిమిషాలు పొడిగించినప్పటికీ ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.
కొలంబియా జట్టులో రడమెల్ ఫల్‌కావో, జుయాన్ క్యుడ్రాడో, లూయిస్ మూరియల్ మూడు గోల్స్ చేయగా... ఇంగ్లాండ్ జట్టులో హ్యారీ కేన్, మార్కస్ రాష్‌ఫోర్డ్, కీరన్ ట్రిప్పియర్ నాలుగు గోల్స్ కొట్టారు. కొలంబియా ఆటగాడు కార్లోస్ బెకా నాలుగో గోల్ చేయడంలో విఫలమయ్యాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాడు ఎరిక్ నాలుగో గోల్ చేశాడు.
దీంతో ఇంగ్లాండ్ క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించడం ఇది రెండోసారి. అంతేకాదు 2006 తర్వాత వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ క్వార్టర్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. టోర్నీలో భాగంగా జరిగే క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్ జట్టు స్వీడన్‌తో తలపడనుంది.