
హైదరాబాద్: యువ ఫుట్‌బాల్ జట్టు 12మంది ప్లేయర్లతో పాటు ఆ టీమ్ కోచ్ ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్‌లోని గుహను చూసేందుకు వెళ్లి అందులో చిక్కుకున్న విషయం తెలిసిందే. జూన్ 23 నుంచి ఆయువ జట్టుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాజం నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. తాజాగా ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో కూడా గుహలో చిక్కుకుపోయిన చిన్నారులు సురక్షితంగా బయటకు పడాలని.. వారు క్షేమంగా వచ్చి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడాలని ఆకాంక్షను తెలియజేశారు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ విషయంపై సిబ్బందికి లేఖ ద్వారా ఆ బృందాన్ని రక్షించాలని ప్రెసిడెంట్ కోరారు. వాళ్లను ఆరోగ్యంగా, సరైన సమయంలో బయటకు తెచ్చేందుకు ప్రయత్నించమని సిబ్బందికి సూచించారు. ఆ గుహలో సీజన్‌ను బట్టి సహజ వనరులు లభిస్తుండటంతో వారు క్షేమంగానే ఉన్నారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నామని గియానీ థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చీఫ్‌కు తెలిపారు.
పిల్లలంతా సురక్షితంగా బయటకు వచ్చి జులై 15న మాస్కోలో జరగనున్న ఫైనల్ సాకర్ సమరాన్ని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే చిన్నారులు వారి కుటుంబంతో కలవాలని ఆశిస్తున్నాను. గుహలో నుంచి బయటపడేందుకు వారికి ఆరోగ్యం సహకరించాలని కోరుకుంటున్నా. 2018 ప్రపంచకప్ ఫైనల్‌కు చిన్నారులందరినీ తమ అతిథులుగా ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని లేఖలో వెల్లడించారు.
కాగా, చిన్నారులు చిక్కుకున్న గుహలో వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయింది. అసలే చిన్నారులు కావడంతో భయాందోళనలకు గురి అవుతుంటారని విశ్లేషకుల అంచనా. వారికి ప్రాణవాయువు అందిద్దామని ప్రయత్నించిన సిబ్బందికి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో వారు వెనుదిరిగారు. అయితే ఆ బృందం సురక్షిత ప్రదేశంలోనే ఉండుంటారని, త్వరలోనే బయటకు వస్తారని వారు చెప్పుకొచ్చారు.