మీలాంటి అభిమానులు మాకొద్దు.. వర్ణ వివక్ష వ్యాఖ్యలపై ఇంగ్లండ్ కెప్టెన్ ఫైర్!

లండన్: తమ ఆటగాళ్లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన అభిమానులపై ఇంగ్లండ్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ హ్యారీ కేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటమి కంటే ఇలాంటి వ్యాఖ్యలే తనను ఎక్కువగా బాధించాయని తెలిపాడు. ఇలాంటి అభిమానులు తమకు అక్కర్లేదని స్పష్టం చేశాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో స్కోర్లు 1-1తో సమమై పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అందులో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 55 ఏళ్ల తర్వాత మేజర్ టోర్నీ ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌కు నిరాశే మిగిలింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారి అల్లరి శృతి మించింది. స్టేడియం నుంచి బయటికి వెళ్లే దారిలో ఇటలీ అభిమానులపై పిడిగుద్దులు కురిపించారు. వారి జాతీయ పతాకాన్ని అవమానపరిచారు.

స్వయంకృపరాధం
అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యారీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం ఇంగ్లండ్ చేసిన వ్యూహాత్మక తప్పిదం. ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్‌ఫోర్డ్ మూడు పెనాల్టీలు వృథా చేశారు. అయితే మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది.

మీలాంటి అభిమానులు మాకొద్దు..
ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యరీ కేన్ ఆటగాళ్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలను తప్పుబడుతూ ఘాటుగా స్పందించాడు. '' మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు ఫైనల్లో మేం ఓడిపోయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్‌ఫోర్డ్‌లను టార్గెట్ చేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ బాధను కలిగించాయి. నిజానికి ఆ ముగ్గురికి అనుభవం లేకపోవచ్చు.. కానీ ఒక చారిత్రక ఫైనల్ మ్యాచ్‌ను వారు ఆడారంటే.. వారిలో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇక్కడి వరకు రారు. పెనాల్టీ షూటౌట్‌లో వారిపై నమ్మకముంచి అవకాశమిచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ మేము ఫలితాన్ని అందుకోలేకపోయాం. అంత మాత్రానికే మీలో కొందరు ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగుతారా?.. జట్టుకు అవసరం లేదని వారిపై కామెంట్లు చేశారు. ఇప్పుడు నేను చెబుతున్నా.. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన మీలాంటి అభిమానులు మాకొద్దు'' అని ట్విటర్ వేదికగా హ్యారీ కేన్ మండిపడ్డాడు.

బ్రిటన్ ప్రధాని ఫైర్..
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్రీడాకారులపై జాతివివక్ష వ్యాఖ్యలను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఖండించారు. ఓడిపోయిన వారిని అలా నిందించడం దుర్మార్గ చర్యగా వర్ణించారు. ఇలాంటి ప్రవర్తనకు తమకు తామే సిగ్గుపడాలని విమర్శించారు. 'జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినవారు తమకు తామే సిగ్గుపడాలి' అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు. ఆటగాళ్లపై దూషణ సహించరానిది, ఇది కచ్చితంగా దుష్ప్రవర్తనే అని ఇంగ్లండ్ ఫుట్‌బాల్ సంఘం ప్రకటించింది. తిట్టడం ఆమోదయోగ్యం కాదంటూ లండన్ పోలీసులు అన్నారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వారిపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కలిసిరాని షూటౌట్..
ఇక మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్‌లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications